WarangalVoice
Newspaper Banner
Date of Publish : 21 April 2026, 1:39 pm Digital Edition : Ravi Goli

వైభవంగా బీరన్న కుంట బొడ్రాయి ద్వితీయ వార్షికోత్సవం

భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజా కార్యక్రమాలు

భారీగా తరలివచ్చిన భక్తులు

ఆధ్యాత్మిక శోభితం

వరంగల్ వాయిస్, హనుమకొండ : స్థానిక బీరన్న కుంట ప్రాంతంలో వెలసిన బొడ్రాయి రెండవ వార్షికోత్సవ వేడుకలు మంగళవారం అత్యంత వైభవంగా జరిగాయి. బొడ్రాయి ప్రతిష్టించి రెండు ఏళ్లు పూర్తయిన సందర్భంగా స్థానిక భక్తులు, మహిళలు పెద్ద ఎత్తున తరలివచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు. వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని తెల్లవారుజాము నుంచే బొడ్రాయి వద్ద ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. అర్చకుల వేదమంత్రాల మధ్య బొడ్రాయికి అభిషేకాలు, అలంకరణలు మరియు శాంతి పూజలు నిర్వహించారు. గ్రామ దేవతలకు నైవేద్యాలు సమర్పించి, మొక్కులు చెల్లించుకున్నారు. బొడ్రాయి చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ భక్తులు భక్తిపారవశ్యంలో మునిగిపోయారు. ఈ వేడుకల్లో స్థానిక నివాసితులు, మహిళలు మంగళహారతులతో తరలివచ్చారు. ప్రాంతం అంతా ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా నిర్వాహకులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. పూజా కార్యక్రమాల అనంతరం భక్తులకు తీర్థప్రసాద వితరణ జరిగింది. బొడ్రాయి చల్లని చూపుతో ఈ ప్రాంతం పాడిపంటలతో, సుఖశాంతులతో వర్ధిల్లాలని భక్తులు ప్రార్థించారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, కాలనీ పెద్దలు, భక్తజనం విశేష సంఖ్యలో పాల్గొన్నారు.