వరంగల్ వాయిస్, దామెర : మండల పరిధిలోని ఒగ్లాపూర్ గ్రామంలో వెలసిన హజ్రత్ సైలానీ బాబా దర్గా గంధం జాతర ఆదివారం అత్యంత అట్టహాసంగా ప్రారంభమైంది. కులమతాలకు అతీతంగా సాగే ఈ వేడుకను వీక్షించేందుకు రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు మహారాష్ట్ర, తమిళనాడు, ఛత్తీస్‌గఢ్ వంటి పొరుగు రాష్ట్రాల నుంచి కూడా భక్తులు భారీగా తరలివచ్చారు. జాతరలో ప్రధాన ఘట్టమైన గంధం ఊరేగింపు ఆదివారం అర్ధరాత్రి వైభవంగా సాగింది. ఒంటెపై గంధాన్ని ఉంచి దర్గా పరిసరాల్లో ఊరేగించారు. అనంతరం బాబా సమాధిపై గంధాన్ని లేపనం చేసి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు, కుడా చైర్మన్ ఇనగాల వెంకటరమణారెడ్డి వేడుకల్లో పాల్గొని బాబాకు చాదర్‌ను సమర్పించారు. వారితో పాటు పరకాల ఆర్డీవో నారాయణ, తహసీల్దార్ జ్యోతి వరలక్ష్మి దేవి, పలువురు ప్రజాప్రతినిధులు బాబాను దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్గా పీఠాధిపతి మహమ్మద్ అబ్దుల్ హమీద్ బాబా భక్తులకు ఆశీస్సులు అందించారు. మహారాష్ట్ర నుంచి వచ్చిన ప్రత్యేక కళాకారుల వాయిద్య ప్రదర్శన భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. వారి డప్పు దరువులు జాతరలో ఉత్సాహాన్ని నింపాయి. జాతర ప్రాంగణంలో పిల్లలు గుర్రాలపై స్వారీ చేస్తూ సందడి చేశారు. వేలాదిగా తరలివచ్చిన భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా పరకాల ఏసీపీ శరత్ బాబు ఆధ్వర్యంలో వంద మంది పోలీసు సిబ్బందితో పటిష్ట బందోబస్తు నిర్వహించారు. భారీ సంఖ్యలో భక్తులు తరలిరావడంతో ఒగ్లాపూర్ పురవీధులన్నీ జనసంద్రంగా మారాయి. సీఐలు సుధాకర్ రెడ్డి, ఎస్సై అశోక్, స్థానిక సర్పంచులు, కమిటీ సభ్యులు జాతర ఏర్పాట్లను పర్యవేక్షించారు.