మహిళలపై లైంగిక దాడులు, బెదిరింపుల కేసు
వరంగల్ వాయిస్, సుబేదారి: సోషల్ మీడియా వేదికగా మహిళలతో పరిచయాలు పెంచుకొని, వారిని నమ్మించి లైంగికంగా వేధించడం, బలవంతపు శారీరక సంబంధాలకు పాల్పడటం, బెదిరింపులకు దిగడం వంటి తీవ్ర నేరాలకు పాల్పడిన సబ్ ఇన్‌స్పెక్టర్ కదిరే శ్రీకాంత్‌ను పోలీసులు అరెస్ట్ చేసినట్లు సుబేదారి పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్ ఎం.రంజిత్ కుమార్ తెలిపారు. నిందితుడు కదిరే శ్రీకాంత్ (38) రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలానికి చెందినవాడు. వివాహితుడైన అతను 2014 బ్యాచ్‌కు చెందిన సబ్ ఇన్‌స్పెక్టర్‌గా వివిధ పోలీస్ స్టేషన్లలో విధులు నిర్వర్తించాడు. సోషల్ మీడియా ద్వారా మహిళల ప్రొఫైళ్లను వెతికి ఫ్రెండ్ రిక్వెస్ట్‌లు పంపుతూ, పరిచయం పెంచుకొని వారిని మానసికంగా, శారీరకంగా వేధించే అలవాటు కలిగి ఉన్నట్లు విచారణలో వెల్లడైంది. 2025 సంవత్సరంలో ఫేస్‌బుక్ ద్వారా ఓ మహిళతో పరిచయం పెంచుకున్న నిందితుడు, తాను పోలీస్ అధికారినని నమ్మబలికి సన్నిహిత సంబంధాలు ఏర్పరచుకున్నాడు. ఆమె వ్యక్తిగత పరిస్థితులను ఆసరాగా చేసుకొని, వరంగల్‌లోని ఆమె నివాసానికి వెళ్లి బలవంతంగా శారీరకంగా దాడి చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. అనంతరం పలు సందర్భాల్లో హోటళ్లకు తీసుకెళ్లి ఆమెపై బలవంతపు లైంగిక దాడులకు పాల్పడ్డాడు. బాధితురాలి నగ్న చిత్రాలు తన వద్ద ఉన్నాయని అబద్ధం చెప్పి, విషయం బయటకు చెబితే చంపేస్తానంటూ బెదిరించడం, వీడియో కాల్స్ ద్వారా అసభ్యకరంగా వేధించడం, డబ్బులు డిమాండ్ చేయడం వంటి చర్యలకు పాల్పడ్డాడు. బాధితురాలు డబ్బులు తిరిగి ఇవ్వాలని కోరగా, రాజకీయ నాయకుల మద్దతు తనకు ఉందని, ఎవరూ తనను ఏమీ చేయలేరని హెచ్చరించినట్లు తేలింది. ఇదివరకు కూడా హైదరాబాద్‌కు చెందిన మరో యువతిని వివాహం చేసుకుంటానని నమ్మించి మోసగించిన కేసులో జగిత్యాల టౌన్ పోలీస్ స్టేషన్‌లో నిందితుడిపై కేసు నమోదైనట్లు పోలీసుల విచారణలో వెలుగులోకి వచ్చింది. బాధితురాలు సుబేదారి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో, అరెస్ట్ భయంతో నిందితుడు విధులకు హాజరు కాకుండా గోవా, హైదరాబాద్, నిజామాబాద్ తదితర ప్రాంతాల్లో తలదాచుకున్నాడు. పోలీసుల నుంచి తప్పించుకునేందుకు తాను ఉపయోగించిన సిమ్ కార్డులను ధ్వంసం చేసి, కేవలం వై-ఫై ద్వారా మాత్రమే కమ్యూనికేషన్ కొనసాగించినట్లు గుర్తించారు. సాంకేతిక ఆధారాలు మరియు విశ్వసనీయ సమాచారంతో నిందితుడి ఆచూకీని గుర్తించిన పోలీసులు, నిజామాబాద్‌లో అతడిని అదుపులోకి తీసుకొని సుబేదారి పోలీస్ స్టేషన్‌కు తరలించి చట్టపరమైన చర్యలు చేపట్టారు. నిందితుడిని కోర్టులో ప్రవేశపెట్టగా, హనుమకొండ జిల్లా మూడవ అదనపు కోర్టు న్యాయమూర్తి అతనికి 14 రోజుల రిమాండ్ విధించినట్లు ఇన్‌స్పెక్టర్ తెలిపారు. మహిళలు సోషల్ మీడియాలో అపరిచిత వ్యక్తులతో పరిచయాలు పెంచుకునే విషయంలో అప్రమత్తంగా ఉండాలని, ఎలాంటి వేధింపులు ఎదురైనా వెంటనే పోలీసులను ఆశ్రయించాలని ఆయన సూచించారు.