WarangalVoice
Newspaper Banner
Date of Publish : 18 April 2026, 2:53 pm Digital Edition : Ravi Goli

సమాజ సేవలో విద్యుత్ ఉద్యోగులు

చలివేంద్రాన్ని ప్రారంభించిన సీఎండీ కర్నాటి

వరంగల్ వాయిస్, హనుమకొండ : నివాసాల్లో వెలుగులు ప్రసరింపజేయడమే కాకుండా, పేదలు, దివ్యాంగులు, అనాథల జీవితాల్లోనూ వెలుగులు నింపడమే లక్ష్యంగా విద్యుత్ ఉద్యోగులు పనిచేస్తున్నారని ఎన్పీడీసీఎల్ సీఎండీ కర్నాటి వరుణ్ రెడ్డి కొనియాడారు. హోప్ ఫుల్ హార్ట్ సొసైటీ ఆధ్వర్యంలో హన్మకొండ నక్కలగుట్టలోని సూపరింటెండింగ్ ఇంజనీర్ కార్యాలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని శనివారం ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎండీ వరుణ్ రెడ్డి మాట్లాడుతూ.. బాటసారుల దాహార్తిని తీర్చడానికి ప్రతి ఏటా క్రమం తప్పకుండా చలివేంద్రాలు ఏర్పాటు చేస్తున్న హోప్ ఫుల్ హార్ట్ సొసైటీ సభ్యులను అభినందించారు. “ఎన్పీడీసీఎల్ పరిధిలోని 17 సర్కిళ్లలో గల 17 స్వచ్ఛంద సంస్థల ద్వారా వృద్ధులకు, వితంతువులకు విద్యుత్ ఉద్యోగులందరూ తమ వంతు ఆర్థిక సహాయం అందించడం గొప్ప విషయం. భవిష్యత్తులో ఈ సహాయాన్ని 30 సంస్థలకు విస్తరిస్తాం” అని వెల్లడించారు. వరంగల్, హన్మకొండ ప్రాంతాలకు పనుల నిమిత్తం వచ్చే పేదలకు కడుపు నిండా అన్నం పెట్టేలా ప్రతి విద్యుత్ ఉద్యోగి సేవా దృక్పథంతో ముందుకు రావాలని ఆయన సూచించారు. కాళోజీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్‌కు వచ్చే రోగులు, వారి బంధువుల కోసం ఏడాది పొడవునా తాగునీరు అందించేందుకు ఆర్వో (RO) వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేయడానికి ముందుకొచ్చిన హోప్ ఫుల్ హార్ట్ సొసైటీని ప్రత్యేకంగా ప్రశంసించారు. వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్ అందించడంతో పాటు సమాజ సేవలో భాగస్వాములవుతున్న ప్రతి ఒక్క ఉద్యోగిని ఆయన అభినందించారు. ఈ కార్యక్రమంలో ఎన్పీడీసీఎల్ డైరెక్టర్లు వి.మోహన్ రావు, వి.తిరుపతి రెడ్డి, టి.మధుసూదన్, సి.ప్రభాకర్, సీఈలు కె.తిరుమల్ రావు, రాజు చౌహన్, మాధవ రావు పాల్గొన్నారు. అలాగే హోప్ ఫుల్ హార్ట్ సొసైటీ అధ్యక్షులు కె.వి.జాన్సన్, ఫాతిమా రెడ్డి, నరేంద్ర పాల్, బండారి ప్రభాకర్, వివిధ యూనియన్ల బాధ్యతలు, ఆర్టిజన్ జెఏసీ నాయకులు, విద్యుత్ శాఖ సిబ్బంది పాల్గొన్నారు.