WarangalVoice
Newspaper Banner
Date of Publish : 06 August 2026, 4:02 pm Digital Edition : Ravi Goli

సైబర్ నేరాలపై అవగాహన సదస్సు

అప్రమత్తంగా ఉండాలని ఎస్సై వీరభద్రరావు పిలుపు

వరంగల్ వాయిస్, దామెర : మండలంలోని ఊరుగొండ గ్రామంలోని రైతు వేదికలో తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఆధ్వర్యంలో “సురక్షా కా తిరంగా – సైబర్ ఇండిపెండెంట్ తెలంగాణ” కార్యక్రమంలో భాగంగా గురువారం సైబర్ అవగాహన సదస్సు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన దామెర పోలీస్ స్టేషన్ ఎస్సై వీరభద్రరావు గ్రామీణులు, డ్వాక్రా మహిళలు, విద్యార్థులను ఉద్దేశించి సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. నేటి ఆధునిక కాలంలో సైబర్ నేరగాళ్లు కొత్త పద్ధతుల్లో మోసాలకు పాల్పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. సోషల్ మీడియా వేదికగా వ్యక్తిగత సమాచారాన్ని, ఫోటోలను ఎవరితోనూ పంచుకోవద్దని సూచించారు. వాట్సాప్‌ మరియు ఇతర సామాజిక మాధ్యమాల్లో వచ్చే అపరిచిత లింక్‌లను పొరపాటున కూడా క్లిక్ చేయవద్దని హెచ్చరించారు. తెలియని వ్యక్తుల నుంచి వచ్చే ఫోన్ కాల్స్‌ను నమ్మి బ్యాంకు ఖాతా వివరాలు, ఓటీపీలు చెప్పకూడదని, ఎలాంటి ఆర్థిక లావాదేవీలు నిర్వహించవద్దని స్పష్టం చేశారు.ఒకవేళ ఎవరైనా సైబర్ మోసాలకు గురైతే, వెంటనే స్పందించి జాతీయ సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్ నంబర్ 1930కు కాల్ చేసి ఫిర్యాదు చేయాలని సూచించారు. అలాగే ఆలస్యం చేయకుండా సమీపంలోని పోలీస్ స్టేషన్‌ను సంప్రదించి తగిన రక్షణ పొందాలని కోరారు. ఈ కార్యక్రమంలో గ్రామస్థులు, డ్వాక్రా మహిళలు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో ఉత్సాహంగా పాల్గొన్నారు.