ఆకట్టుకున్న ఒగ్గు డోలు నృత్యాలు, సాంస్కృతిక ప్రదర్శనలు
హాజరైన వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం
వరంగల్ వాయిస్, హనుమకొండ : శ్రీకృష్ణ జన్మాష్టమిని పురస్కరించుకుని యాదవ వెల్ఫేర్ ట్రస్ట్ చైర్మన్ ఎస్ .సుందర్ రాజ్ ఆధ్వర్యంలో శుక్రవారం హనుమకొండ కాళోజీ కళాక్షేత్రంలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించడం జరిగింది.ముందుగా రామ్ నగర్ నుంచి అంబేద్కర్ సెంటర్, అశోక సెంటర్, బస్టాండ్ మీదుగా కాళోజి కళాక్షేత్రం వరకు శ్రీకృష్ణుడి రథయాత్ర నిర్వహించారు.భారీ రధయాత్రను తిలకించేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఈ సందర్భంగా ఒగ్గు డోలు కళాకారుల నృత్యాలు, సాంస్కృతిక ప్రదర్శనలు అలరించాయి. ప్రముఖ గాయకులు మల్లిక్ తేజ, కోమల టీమ్ ఆటా పాట ఉత్తేజపరిచాయి. కళాక్షేత్రం ఆవరణ గొల్లకురుమలు, శ్రీకృష్ణడి భక్తులతో కిక్కిరిసిపోయింది. వేడుకలకు బీఆర్ఎస్ శాసన మండలి ప్రతిఫక్ష నేత మదుసుదానాచారి, పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, సీపీఐ ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం యాదవ్, మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్, మాజీ ఎమ్మెల్యేలు దాస్యం వినయ్ భాస్కర్, మార్తినేని ధర్మారావు,డాక్టర్ కాళీ ప్రసాద్, ఢిల్లీకి చెందిన యాదవ సంఘం నేతలు డాక్టర్ అజిత్ యాదవ్, శైలజ యాదవ్ తదితరులు పాల్గొన్నారు….ఈ సందర్భంగా వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ.. తాను కాళోజీ కళా క్షేత్రంలో చూసిన అతి పెద్ద కార్యక్రమం ఇదేనన్నారు…సుందర్ రాజ్ యాదవ్ కోరినట్లు కృష్ణ మందిరం, యాదవ హాస్టల్ నిర్మాణం కోసం హన్మకొండ పరిధిలో ఎకరం భూమికి తక్కువ కాకుండ ఇప్పిస్తానని హామీ ఇచ్చారు. గొల్లకురుమలు నిర్వహించే కార్యక్రమాలకు తన సహకారం ఎల్లప్పుడూ ఉంటుందన్నారు. రాజకీయాలకు అతీతంగా ఇలాంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించడం, అందరినీ ఒక వేదిక మీదికి తీసుకురావడం అభినందనీయమన్నారు.అనంతరం యాదవ వెల్ఫేర్ ట్రస్ట్ చైర్మన్ సంగంరెడ్డి సుందర్ రాజ్ యాదవ్ మాట్లాడుతూ…. గత నాలుగేళ్లుగా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు నిర్వహిస్తున్నామని గుర్తు చేశారు. కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు యాదవులు ఐక్యం కావలసిన అవసరం ఉందన్నారు… ఈ కార్యక్రమంలో యాదవ్ వెల్ఫేర్ ట్రస్ట్ కార్యవర్గ సభ్యులు, పెద్ద సంఖ్యలో గొల్ల, కురుములు పాల్గొన్నారు.