WarangalVoice
Newspaper Banner
Date of Publish : 21 April 2026, 2:14 pm Digital Edition : Ravi Goli

‘108’ అంబులెన్స్‌ ఆకస్మిక తనిఖీ

వరంగల్ వాయిస్, దామెర : మండల కేంద్రంలోని అంబులెన్స్ సేవలను జిల్లా అధికారి మండ శ్రీనివాస్ మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. అంబులెన్స్‌లోని సౌకర్యాలు, అత్యవసర వైద్య పరికరాల పనితీరును ఆయన క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ప్రస్తుత వేసవి తీవ్రత దృష్ట్యా వడదెబ్బకు గురైన బాధితులకు అందించాల్సిన అత్యవసర ప్రథమ చికిత్సపై అంబులెన్స్ సిబ్బందికి ఆయన కీలక సూచనలు చేశారు. బాధితులను ఆసుపత్రికి తరలించే లోపే వారి ప్రాణాలను కాపాడేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. అంబులెన్స్‌లో మెడికల్ కిట్లు, అవసరమైన మందుల నిల్వలను తనిఖీ చేసి, గడువు ముగిసిన మందులు లేకుండా చూసుకోవాలని ఆదేశించారు. వైద్య పరికరాలతో పాటు అంబులెన్స్ వాహన పరిస్థితిపై కూడా ఆయన సమీక్షించారు. అత్యవసర సమయాల్లో వాహనం మొరాయించకుండా ఎప్పటికప్పుడు మెకానికల్ చెకప్ చేయించుకోవాలని డ్రైవర్లకు సూచించారు. నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రాణాపాయ స్థితిలో ఉన్నవారిని సకాలంలో ఆసుపత్రికి చేర్చి ప్రాణదాతలుగా నిలవాలని సిబ్బందిని కోరారు. ఈ తనిఖీలో అంబులెన్స్ సిబ్బంది, ఆరోగ్య శాఖ ప్రతినిధులు పాల్గొన్నారు.