WarangalVoice
Newspaper Banner
Date of Publish : 24 September 2026, 5:58 am Digital Edition : Ravi Goli

ప్రొఫెసర్స్ కాలనీలో వైభవంగా గణేష్ ఉత్సవ వేడుకలు

అలరించిన చిన్నారుల కూచిపూడి నాట్య ప్రదర్శన

వరంగల్ వాయిస్, హసన్ పర్తి: హనుమకొండ ప్రొఫెసర్స్ కాలనీలో గణేష్ నవరాత్రి ఉత్సవాలు భక్తిశ్రద్ధలు, సాంస్కృతిక వైభవంతో ఘనంగా ముగిశాయి. నిమజ్జనం మరియు వీడ్కోలు కార్యక్రమాల్లో భాగంగా నిర్వహించిన సాంస్కృతిక ప్రదర్శనలు కాలనీవాసులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా చిన్నారులు సమర్పించిన భరతనాట్య ప్రదర్శన ఈ వేడుకలకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. కేవలం నాలుగు సంవత్సరాల వయస్సు నుంచే నాట్య శిక్షణ పొందుతున్న పది మంది చిన్నారులు లయ, తాళం, అభినయంతో చేసిన సమిష్టి భరతనాట్యం ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసింది. చిన్నారుల హావభావాలు, నృత్య రీతులకు కాలనీవాసులు ఆనంద పరవశులై చప్పట్లతో అభినందనలు తెలిపారు. “వయస్సు చిన్నదైనా ప్రతిభకు హద్దులు లేవు” అని కొనియాడారు. ఈ ప్రదర్శన కాలనీలోని ఇతర పిల్లల్లో కూడా సాంప్రదాయ కళలపై ఆసక్తిని పెంచేలా ఉందనే అభిప్రాయం వ్యక్తమైంది. చిన్నారుల అద్భుత నృత్య పటిమను గుర్తించి నిర్వాహకులు వారిని బహుమతులతో సత్కరించి ప్రోత్సహించారు. చిన్నారులు భవిష్యత్తులో రాష్ట్ర, జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకోవాలని, ఆ విఘ్నేశ్వరుని ఆశీస్సులతో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని కాలనీవాసులు ఆకాంక్షించారు. ఉత్సవాలు ముగిసినప్పటికీ చిన్నారులు ప్రదర్శించిన కళా వైభవం కాలనీవాసుల మనస్సుల్లో చిరస్థాయిగా నిలిచిపోయిందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ పొన్నాల రామయ్య, ఫార్చ్యూన్ రెసిడెన్సీ అధ్యక్షులు బొక్క కుమార్, దండా సంపత్ రెడ్డి, దేశిని శ్రీధర్ గౌడ్, వల్లాల చంద్రమోహన్, కేసు పెద్ద మహేందర్ రాజు, రేవా ఈశ్వర్, బాలరాజు తదితరులు పాల్గొన్నారు.