WarangalVoice
Newspaper Banner
Date of Publish : 26 October 2026, 4:00 pm Digital Edition : Ravi Goli

గుట్టపైన బోర్ దెబ్బ!గుట్టపైన బోర్ దెబ్బ!

పసరగొండ గుట్టల్లో అనుమతులు లేకుండా బోర్లు?

అక్రమంగా నీటి తరలింపు జరుగుతోందన్న ఆరోపణలు

అధికారుల పర్యవేక్షణ ఏదీ? చర్యలు ఎప్పుడు?

దామెర: హనుమకొండ జిల్లా దామెర మండలంలోని పసరగొండ గుట్టల్లో అక్రమంగా బోర్లు వేసి, అనుమతులు లేకుండానే నీటిని తరలిస్తున్నారనే ఆరోపణలు స్థానికంగా చర్చనీయాంశంగా మారుతున్నాయి. గుట్టల ప్రాంతంలో బోర్లు వేయడం, అక్కడి నుంచి నీటిని ఇతర ప్రాంతాలకు తరలించడం వెనుక అనుమతులు ఉన్నాయా? లేదా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

అనుమతులు ఉన్నాయా?

గుట్టల ప్రాంతంలో బోర్లు వేయాలంటే సంబంధిత శాఖల అనుమతులు అవసరమా? నిబంధనలకు అనుగుణంగానే బోర్లు ఏర్పాటు చేశారా? నీటి తరలింపునకు అధికారుల అనుమతి తీసుకున్నారా? అనే అంశాలపై స్పష్టత రావాల్సి ఉంది. ఈ వ్యవహారంపై సంబంధిత అధికారులు క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టి వాస్తవాలను వెల్లడించాల్సిన అవసరం ఉంది.

భూగర్భ జలాలపై ప్రభావం పడేనా?

అనుమతులు లేకుండా బోర్లు వేసి పెద్దఎత్తున నీటిని తోడితే భూగర్భ జలాలపై ప్రభావం పడే అవకాశం ఉందన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే వేసవిలో నీటి ఎద్దడి ఎదురయ్యే ప్రాంతాల్లో ఇలాంటి కార్యకలాపాలు కొనసాగితే భవిష్యత్తులో నీటి సమస్యలు మరింత తీవ్రమయ్యే ప్రమాదం ఉందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు.

అధికారుల దృష్టికి వెళ్లేనా?

పసరగొండ గుట్టల్లో బోర్ల ఏర్పాటు, నీటి తరలింపునకు సంబంధించి సంబంధిత శాఖల అధికారులు సమగ్ర విచారణ చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు. బోర్లకు అవసరమైన అనుమతులు ఉన్నాయా? నీటిని ఏ అవసరాలకు తరలిస్తున్నారు? నిబంధనలకు విరుద్ధంగా కార్యకలాపాలు జరుగుతున్నాయా? అనే అంశాలను పరిశీలించి, తప్పులు తేలితే చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.