WarangalVoice
Newspaper Banner
Date of Publish : 15 August 2026, 11:21 am Digital Edition : Ravi Goli

80 మీటర్ల జాతీయ జెండాతో ఘనంగా తిరంగా ర్యాలీ….

వరంగల్ వాయిస్, హనుమకొండ : 80వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని దేశభక్తి, జాతీయ ఐక్యత, త్రివర్ణ పతాకంపై గౌరవాన్ని ప్రజల్లో మరింత పెంపొందించాలనే సంకల్పంతో గ్రేటర్ వరంగల్ 60వ డివిజన్ తాజా మాజీ కార్పొరేటర్ డా. దాస్యం అభినవ్ భాస్కర్ ఆధ్వర్యంలో శనివారం ఉదయం ఘనంగా తిరంగా ర్యాలీ నిర్వహించడం జరిగింది. వడ్డేపల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాల నుంచి ప్రారంభమైన ఈ ర్యాలీలో 80 మీటర్ల భారీ జాతీయ జెండాతో యువత, విద్యార్థులు, మహిళలు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని దేశభక్తి నినాదాలతో ర్యాలీ ఉత్సాహంగా సాగగా, 80 మీటర్ల జాతీయ జెండా ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.ఈ సందర్భంగా డా. దాస్యం అభినవ్ భాస్కర్ మాట్లాడుతూ…మన జాతీయ జెండా కేవలం ఒక పతాకం కాదని.. అది మన స్వాతంత్ర్యానికి, దేశ గౌరవానికి, జాతీయ ఐక్యతకు ప్రతీక అని పేర్కొన్నారు. స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను స్మరించుకుంటూ, యువతలో దేశభక్తి, జాతీయ స్ఫూర్తిని పెంపొందించేందుకు గత ఐదు సంవత్సరాలుగా ప్రతి స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా తిరంగా ర్యాలీ నిర్వహిస్తున్నామని తెలిపారు.దేశ ఐక్యత, సమగ్రత, సార్వభౌమత్వాన్ని కాపాడేందుకు ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ర్యాలీలో పాల్గొన్న యువత, విద్యార్థులు, మహిళలు, స్థానిక ప్రజలకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో బీజేపీ పదాధికారులు, నాయకులు, కార్యకర్తలు, యువత, విద్యార్థులు, మహిళలు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.