Saturday, June 27, 2026
HomeHanamkondaఐదేళ్లలోపు చిన్నారులందరికీ పోలియో చుక్కలు వేయించాలి

ఐదేళ్లలోపు చిన్నారులందరికీ పోలియో చుక్కలు వేయించాలి

📰 Generate e-Paper Clip

జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయి

వరంగల్ వాయిస్, హనుమకొండ : పోలియో రహిత సమాజ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని, జననం నుంచి ఐదేళ్లలోపు ప్రతి చిన్నారికి తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయి పిలుపునిచ్చారు. “నిండు ప్రాణానికి రెండు చుక్కలు” అనే నినాదంతో ఈ నెల 28, 29, 30 తేదీల్లో నిర్వహించనున్న పల్స్ పోలియో కార్యక్రమానికి జిల్లాలో అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని ఆమె శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలో 0 నుంచి 5 సంవత్సరాల వయస్సు గల 84,301 మంది చిన్నారులకు పోలియో వ్యాక్సిన్ అందించే లక్ష్యంతో సమగ్ర ప్రణాళికను రూపొందించినట్లు కలెక్టర్ వివరించారు. ఇందుకోసం జిల్లా వ్యాప్తంగా కింది విధంగా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. పోలియో బూత్‌లు: 460, మొబైల్ బృందాలు: 27, ట్రాన్సిట్ బృందాలు: 12, పర్యవేక్షణ బృందాలు: 27, నియమించిన సిబ్బంది: 1,804 మంది ఉన్నారు. ఈ నెల 28 జిల్లాలోని గ్రామ పంచాయతీలు, అంగన్వాడీ కేంద్రాలు, ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాలు, పాఠశాలల్లో ఏర్పాటు చేసిన బూత్‌లలో చిన్నారులకు పోలియో చుక్కలు వేస్తారు. ఆ తర్వాత.. మిగిలిపోయిన చిన్నారులను గుర్తించి 29, 30 తేదీల్లో సిబ్బంది ఇంటింటికీ వెళ్లి వ్యాక్సిన్ అందిస్తారు. పోలియో నిర్మూలనలో తల్లిదండ్రుల పాత్ర అత్యంత కీలకమని, ఐదేళ్లలోపు పిల్లలందరికీ తప్పనిసరిగా చుక్కలు వేయించి వారి ఆరోగ్యాన్ని కాపాడాలని కలెక్టర్ విజ్ఞప్తి చేశారు. ఆరోగ్య శాఖ, ఐసీడీఎస్, అంగన్వాడీ, ఆశా కార్యకర్తలు, ఇతర శాఖల సిబ్బంది పరస్పర సమన్వయంతో పనిచేయాలని.. ఏ ఒక్క చిన్నారి కూడా వ్యాక్సిన్‌కు దూరం కాకుండా ప్రత్యేక చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ప్రజలందరూ బాధ్యతగా సమీప పోలియో కేంద్రానికి తమ చిన్నారులను తీసుకువచ్చి, రెండు చుక్కలు వేయించడం ద్వారా పోలియో రహిత సమాజ నిర్మాణంలో భాగస్వాములు కావాలని కలెక్టర్ చాహత్ బాజ్ పాయి కోరారు.

RELATED ARTICLES

Most Popular