రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో సీళ్ల గుర్తింపు
పటిష్ట భద్రత మధ్య తరలింపు
పరిశీలించిన కలెక్టర్ చాహత్ బాజ్ పాయ్
వరంగల్ వాయిస్, హనుమకొండ : హనుమకొండ జిల్లాకు సంబంధించిన ఈవీఎంలను బుధవారం ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ యార్డులోని తాత్కాలిక గోదాముల నుంచి సుబేదారిలో నూతనంగా నిర్మించిన శాశ్వత గిడ్డంగికి తరలించారు. జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయ్ వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో ఈ తరలింపు ప్రక్రియను స్వయంగా పర్యవేక్షించారు. ఎనుమాముల మార్కెట్ యార్డులో భద్రపరిచిన ఈవీఎంలు, వీవీప్యాట్ బాక్సుల సీళ్లను రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో అధికారులు తెరిచారు. అనంతరం పటిష్ట పోలీస్ బందోబస్తు మధ్య ప్రత్యేక వాహనాల్లో వీటిని సుబేదారి రెడ్ క్రాస్ కార్యాలయం వెనుక నిర్మించిన నూతన ఈవీఎం గోదాముకు తరలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. కేంద్ర ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం అత్యంత పారదర్శకంగా, పటిష్ట భద్రత నడుమ ఈ ప్రక్రియను పూర్తి చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి సత్యపాల్ రెడ్డి, హనుమకొండ ఆర్డీఓ రాథోడ్ రమేష్, తహసీల్దార్లు రవీందర్ రెడ్డి, రాజు, ఎన్నికల విభాగం సూపరింటెండెంట్ జగత్ సింగ్, డిప్యూటీ తహసీల్దార్ శ్యాం కుమార్, రాజకీయ పార్టీల తరపున ప్రతినిధులు శ్యాంసుందర్, రజనీకాంత్, ఎండి నేహాల్, మహమ్మద్ రహీం ఖాన్, వీరానంద్ తదితరులు హాజరై తరలింపు ప్రక్రియను గమనించారు.

