ఎల్ఎండి, పోచంపాడు కార్యాలయ ఆస్తుల జప్తుకు ఆదేశం
అధికారుల నిర్లక్ష్యంపై రంగారెడ్డి కోర్టు ఆగ్రహం
వరంగల్ వాయిస్, వరంగల్/హనుమకొండ : నీటిపారుదల శాఖ అధికారుల నిర్లక్ష్యం ఆ శాఖకే తలవంపులు తెచ్చింది. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ కాకతీయ కెనాల్ పనులు పూర్తి చేసిన కాంట్రాక్టర్‌కు బిల్లులు చెల్లించకుండా కాలయాపన చేయడమే కాకుండా, న్యాయస్థానం ఆదేశాలను సైతం బేఖాతరు చేసినందుకు ఇరిగేషన్ శాఖ ఆస్తులను జప్తు చేయాలని రంగారెడ్డి కోర్టు సంచలన ఆదేశాలు జారీ చేసింది. ‘వెంకటేశ్వర ఇంజనీర్స్ అండ్ కాంట్రాక్టర్స్’ అనే సంస్థ శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ కింద సుమారు రూ.16 కోట్ల విలువైన పనులను పూర్తి చేసింది. అయితే, పనులు పూర్తయినప్పటికీ బిల్లుల చెల్లింపులో ఇరిగేషన్ అధికారులు తీవ్ర జాప్యం చేస్తూ వచ్చారు. దీంతో సదరు కాంట్రాక్ట్ సంస్థ వరంగల్ కోర్టును ఆశ్రయించగా, బిల్లు మొత్తాన్ని కోర్టులో డిపాజిట్ చేయాలని న్యాయమూర్తి గతంలోనే ఆదేశించారు. అయినప్పటికీ అధికారులు ఆ ఆదేశాలను ఏమాత్రం పట్టించుకోకుండా నిర్లక్ష్యం ప్రదర్శించారు. వరంగల్ కోర్టు ఆదేశాల అమలులో జాప్యం జరగడంతో, నీటిపారుదల శాఖ వ్యవహారాలను పర్యవేక్షిస్తున్న రంగారెడ్డి కోర్టుకు కాంట్రాక్టర్ వెళ్లారు. విచారణ చేపట్టిన న్యాయమూర్తి.. అధికారులు ఉద్దేశపూర్వకంగానే నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రూ.50 లక్షల విలువైన ఆస్తులను జప్తు చేయాలని ఉత్తర్వులు జారీ చేశారు. కరీంనగర్ ఎల్ఎండీ , నిజామాబాద్ పోచంపాడు కార్యాలయాల్లోని ఫర్నిచర్, కార్యాలయాల్లో ఉన్న 24 ఏసీలు, అధికారుల వాడకంలో ఉన్న 2 కార్లను జప్తు చేయాలని కోర్టు ఆదేశించింది. కోర్టు ఆదేశాలతో ఒక్కసారిగా షాక్‌కు గురైన ఉన్నతాధికారులు ఇప్పుడు పరుగులు పెడుతున్నారు. ఆస్తుల జప్తు జరగకుండా ఉండేందుకు వెంటనే కోర్టులో డబ్బు డిపాజిట్ చేసేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టినట్లు తెలుస్తోంది. ఒకటి రెండు రోజుల్లో ఈ ప్రక్రియ పూర్తి కాకపోతే, కోర్టు సిబ్బంది నేరుగా రంగంలోకి దిగి ఆస్తులను స్వాధీనం చేసుకోనున్నారు. ప్రభుత్వ శాఖల్లో అధికారుల అలసత్వం వల్ల ఇలా ఆస్తుల జప్తు వరకు వెళ్లడం ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.
