Saturday, April 18, 2026
HomeHanamkonda‘చలో కాళేశ్వరం - దేఖో మేడిగడ్డ’

‘చలో కాళేశ్వరం – దేఖో మేడిగడ్డ’

📰 Generate e-Paper Clip

కాళేశ్వరంపై కాంగ్రెస్‌కు కనువిప్పు కలగాలి

దాస్యం వినయ్ భాస్కర్

కేసీఆర్ నిర్మించిన కల్పతరువు మేడిగడ్డ..

కూలిందన్నది పచ్చి అబద్ధం

వరంగల్ వాయిస్, మేడిగడ్డ (కాళేశ్వరం): తెలంగాణ ప్రజల సాగు, తాగునీటి అవసరాలు తీరుస్తున్న కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న దుష్ప్రచారాలను ఎండగట్టేందుకు బీఆర్ఎస్ పార్టీ సిద్ధమైంది. ‘చలో కాళేశ్వరం – దేఖో మేడిగడ్డ’ పిలుపులో భాగంగా శనివారం ఉమ్మడి వరంగల్ జిల్లా బీఆర్ఎస్ నేతలతో కలిసి మాజీ చీఫ్ విప్, హనుమకొండ జిల్లా పార్టీ అధ్యక్షుడు దాస్యం వినయ్ భాస్కర్ ప్రాజెక్టును సందర్శించారు. ఈ సందర్భంగా దాస్యం వినయ్ భాస్కర్ మాట్లాడుతూ.. తెలంగాణ రైతాంగం కోసం కేసీఆర్ గారు కాళేశ్వరం వంటి అద్భుత ప్రాజెక్టును నిర్మించారని, ఆ నాడు రైతులు ఎంతో ఆనందంగా ఉన్నారని గుర్తు చేశారు. అయితే, అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ కేసీఆర్ ని బద్నాం చేయడమే లక్ష్యంగా కుట్రలు చేస్తోందని మండిపడ్డారు. కాళేశ్వరం కూలిపోయిందని, కొట్టుకుపోయిందని అబద్ధాలు ప్రచారం చేస్తున్నారే తప్ప, రెండున్నరేళ్లుగా దెబ్బతిన్న మూడు పిల్లర్లను రిపేర్ చేసే ప్రయత్నం రేవంత్ సర్కార్ చేయడం లేదని విమర్శించారు. “కాళేశ్వరం కూలిపోలేదని, దాని ప్రాముఖ్యత ఏంటో ప్రభుత్వానికి కళ్లకు కట్టినట్లు చూపేందుకే ఈ రోజు మేడిగడ్డకు వచ్చాం. ప్రాజెక్టు చెక్కుచెదరలేదు, కేవలం అతి స్వల్పంగా దెబ్బతిన్న భాగాలను బాగు చేస్తే చాలు” అని ఆయన స్పష్టం చేశారు. ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం కళ్లు తెరిచి రాజకీయ కక్ష సాధింపులు పక్కన పెట్టాలని డిమాండ్ చేశారు. రైతుల ప్రయోజనాల దృష్ట్యా వెంటనే మేడిగడ్డ పిల్లర్ల మరమ్మతులు చేపట్టి, ప్రాజెక్టు ద్వారా నీటిని విడుదల చేయాలని దాస్యం వినయ్ భాస్కర్ డిమాండ్ చేశారు. ఈ పర్యటనలో ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ ముఖ్య నేతలు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular