కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్
వరంగల్ వాయిస్, శాయంపేట : ప్రభుత్వ పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాల్లో చేపట్టిన అభివృద్ధి పనులను నిర్దేశిత కాల పరిమితిలోగా పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురావాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్ అధికారులను ఆదేశించారు. మంగళవారం ఆమె శాయంపేట మండలం మైలారం గ్రామంలో పర్యటించి, అంగన్వాడీ కేంద్రం, మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. అంగన్వాడీ కేంద్రంలో చిన్నారులతో కలెక్టర్ కాసేపు ముచ్చటించారు. వారితో ఆంగ్ల పద్యాలను చదివించి వారి అభ్యాస స్థాయిని స్వయంగా అంచనా వేశారు. అనంతరం పోషణ్ అభియాన్ యాప్‌లో నమోదైన బాలింతలు, గర్భిణీలు, చిన్నారుల వివరాలను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. కేంద్రాల్లో మెనూ ప్రకారం పౌష్టికాహారం తప్పనిసరిగా అందించాలని, ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలన్నీ లబ్ధిదారులకు సక్రమంగా అందేలా చూడాలని సూచించారు. భవన నిర్మాణ పనుల్లో జాప్యం చేయకుండా త్వరితగతిన పూర్తి చేయాలని కాంట్రాక్టర్లను ఆదేశించారు. అనంతరం ప్రాథమికోన్నత పాఠశాలను సందర్శించిన కలెక్టర్, విద్యార్థుల హాజరు శాతంపై ఉపాధ్యాయులను విచారించారు. పాఠశాలలోని తాగునీటి సదుపాయం, టాయిలెట్లను పరిశీలించారు. పూర్తయిన టాయిలెట్లకు వెంటనే రంగులు వేయాలని, విద్యార్థులకు స్వచ్ఛమైన ఆకుకూరలు అందించేందుకు పాఠశాల ఆవరణలో కిచెన్ గార్డెన్ ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు. మైలారం గ్రామ పంచాయతీ కార్యాలయాన్ని సందర్శించి గ్రామంలోని పారిశుద్ధ్య పరిస్థితులపై సమీక్షించారు. బ్లీచింగ్ పౌడర్ నిల్వలు, వీధి దీపాల నిర్వహణపై పంచాయతీ కార్యదర్శిని వివరాలు అడిగి తెలుసుకున్నారు. వేసవి కాలం దృష్ట్యా వ్యాధులు ప్రబలకుండా గ్రామంలో పారిశుద్ధ్య నిర్వహణ మెరుగ్గా ఉండాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో పరకాల ఆర్డీవో డాక్టర్ కన్నం నారాయణ, జిల్లా పంచాయతీ అధికారి లక్ష్మీ రమాకాంత్, ఎంపీడీవో ఫణి చంద్ర, తహసిల్దార్ ప్రవీణ్ కుమార్, ఎంఈఓ భిక్షపతి, సర్పంచ్ నూనె దివ్య, పంచాయతీ కార్యదర్శి రాజేందర్ తదితరులు పాల్గొన్నారు.

