Sunday, April 26, 2026
HomeWarangalరాంపెల్లి లింగమూర్తికి “పద్మ శ్రీ గ్లోబల్ ఎక్సలెన్స్ అవార్డు”

రాంపెల్లి లింగమూర్తికి “పద్మ శ్రీ గ్లోబల్ ఎక్సలెన్స్ అవార్డు”

📰 Generate e-Paper Clip

వరంగల్ వాయిస్, నర్సంపేట : వరంగల్ మట్టిలో పుట్టిన ప్రతిభ జాతీయ స్థాయిలో మెరిసింది. డిజిటల్ మీడియా, జర్నలిజం రంగాల్లో నిబద్ధతతో పనిచేస్తూ సమాజంపై చెరగని ముద్ర వేసిన ప్రముఖ జర్నలిస్ట్ రాంపెల్లి లింగమూర్తికి ప్రతిష్టాత్మకమైన “పద్మ శ్రీ గ్లోబల్ ఎక్సలెన్స్ అవార్డు 2026” వరించింది. ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగరాజ్‌కు చెందిన జివ్రాన్ ఫౌండేషన్ వారు దేశవ్యాప్తంగా వివిధ రంగాల్లో అద్భుత ప్రతిభ కనబరిచిన వారిని గుర్తించి ఈ గౌరవాన్ని అందజేశారు. ప్రజా సమస్యలపై అలుపెరగని పోరాటం, నిష్పక్షపాత వార్తా సేకరణ, డిజిటల్ మీడియాలో వినూత్న పోకడలను పరిచయం చేయడం వంటి అంశాల్లో లింగమూర్తి చూపిన ప్రతిభను నిర్వాహకులు ప్రత్యేకంగా కొనియాడారు. సమాజంలో జరుగుతున్న పరిణామాలను ఎప్పటికప్పుడు ప్రజలకు చేరవేస్తూ, వారిలో చైతన్యం నింపడంలో ఆయన పోషించిన పాత్రను ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. కేవలం జర్నలిజానికే పరిమితం కాకుండా, లింగమూర్తి MBA, MCJ, M.Sc (Psychology) వంటి ఉన్నత విద్యార్హతలు సాధించి, సైకాలజీ మరియు పబ్లిక్ రిలేషన్స్ రంగాల్లోనూ విశేషమైన పట్టు సాధించారు. ఈ బహుముఖ ప్రజ్ఞ ఆయనను ఒక విశ్వసనీయ జర్నలిస్ట్‌గా నిలబెట్టింది. ప్రభుత్వ పథకాలు, సంక్షేమ ఫలాలను సామాన్యులకు అర్థమయ్యే రీతిలో వివరించడంలో ఆయన శైలి ప్రత్యేకమైనది. అవార్డు అందుకున్న అనంతరం ఆయన మాట్లాడుతూ.. “జాతీయ స్థాయిలో ఈ గౌరవం లభించడం నా బాధ్యతను మరింత పెంచింది. జర్నలిజం పట్ల నేను చూపిస్తున్న నిబద్ధతకు లభించిన ఈ గుర్తింపు, భవిష్యత్తులో మరింత ఉత్సాహంగా పనిచేయడానికి స్ఫూర్తినిస్తుంది. నిరంతరం ప్రజాపక్షాన ఉండి, సమాజ శ్రేయస్సు కోసం పాటుపడతాను,” అని భావోద్వేగంగా పేర్కొన్నారు.

RELATED ARTICLES

Most Popular