Thursday, June 18, 2026
HomeHanamkondaఉపాధి కల్పనలో ‘వికసిత్ భారత్’ విప్లవం

ఉపాధి కల్పనలో ‘వికసిత్ భారత్’ విప్లవం

📰 Generate e-Paper Clip

వరంగల్ రీజినల్ పీఎఫ్ కమిషనర్ వై.డి.శ్రీనివాస్

ప్రధాని మోదీ చేతుల మీదుగా రూ.2,400 కోట్ల ప్రోత్సాహకాల విడుదల

వరంగల్ వాయిస్, హనుమకొండ : దేశంలో ఉపాధి అవకాశాల విస్తరణకు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘ప్రధాన మంత్రి వికసిత్ భారత్ రోజ్‌గార్ యోజన’ కీలక పాత్ర పోషించనుందని వరంగల్ రీజినల్ ప్రావిడెంట్ ఫండ్ కమిషనర్ వై.డి. శ్రీనివాస్ తెలిపారు. గురువారం సాయంత్రం హనుమకొండ దర్గా రోడ్డులోని ఈపీఎఫ్ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన ఈ పథకానికి సంబంధించిన పూర్తి వివరాలను వెల్లడించారు. జూన్ 19న న్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో ప్రధాని నరేంద్ర మోదీ సమక్షంలో, కేంద్ర కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఈ పథకానికి సంబంధించిన జాతీయ స్థాయి కార్యక్రమం జరగనుంది. ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా ఉన్న లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లోకి నేరుగా సుమారు రూ.2,400 కోట్ల ప్రోత్సాహకాలను ప్రధాని విడుదల చేయనున్నారు. ఈ ప్రతిష్టాత్మక పథకం ద్వారా దేశవ్యాప్తంగా 15 లక్షల మందికి పైగా అదనపు ఉపాధి అవకాశాలు లభించనున్నాయని కమిషనర్ పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా ఎంపిక చేసిన 200 ప్రధాన కేంద్రాల్లో ఒకేసారి ప్రాంతీయ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు వై.డి.శ్రీనివాస్ తెలిపారు. ఇందులో భాగంగా వరంగల్ రీజినల్ కార్యాలయ పరిధిలోని హనుమకొండ నక్కలగుట్ట అదాలత్ సర్కిల్ సమీపంలో గల ‘ఏకాశిల బ్యాంక్వెట్ హాల్‌’లో ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర మంత్రి కొండా సురేఖ, ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, ఎంపీ కడియం కావ్య, జిల్లా కలెక్టర్లు చాహత్ బాజ్‌పాయ్, డాక్టర్ సత్య శారద ముఖ్య అతిథులుగా హాజరుకానున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లా పరిధి నుంచి 50 మంది యజమానులు, 200 మంది ఉద్యోగులతో కలిపి మొత్తం 250 మంది లబ్ధిదారులు ఈ వేడుకలో పాల్గొంటారని వివరించారు. వ్యవస్థీకృత రంగంలో తొలిసారి ఉద్యోగాల్లో చేరే యువతకు ఆర్థికంగా వెన్నుదన్నుగా నిలవడంతో పాటు, అదనపు ఉపాధి కల్పించే యజమానులను ప్రోత్సహించడమే ఈ పథకం ముఖ్య ఉద్దేశమని కమిషనర్ తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ఈ పథకం కోసం రూ.99,446 కోట్ల నిధులను కేటాయించింది. రాబోయే రెండేళ్లలో 3.5 కోట్లకు పైగా అదనపు ఉద్యోగాల సృష్టి, అలాగే 1.92 కోట్ల మంది యువతను అధికారిక ఉపాధి రంగంలోకి తీసుకురావడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. 2025 ఆగస్టు 1 నుండి 2027 జూలై 31 మధ్య కాలంలో సృష్టించిన కొత్త ఉద్యోగాలకు ఈ పథకం వర్తిస్తుంది. ఈ పథకం కింద లబ్ధిదారులను రెండు రకాలుగా విభజించి ప్రోత్సాహకాలు అందిస్తున్నట్లు పీఎఫ్ కమిషనర్ స్పష్టం చేశారు. తొలిసారి ఉద్యోగంలో చేరిన వారికి ఈపీఎఫ్‌ఓలో నమోదై, నెలకు రూ.1 లక్షలోపు వేతనం పొందే కొత్త ఉద్యోగులకు ఒక నెల వేతనానికి సమానమైన ప్రోత్సాహకాన్ని (గరిష్టంగా రూ.15,000 వరకు) విడతల వారీగా అందిస్తారు. ఉద్యోగంలో చేరి 6 నెలల నిరంతర సేవ పూర్తి చేసుకున్నాక తొలి విడత, 12 నెలల సేవ పూర్తయ్యాక రెండో విడత నిధులు నేరుగా ఖాతాల్లో జమ అవుతాయి. తమ సంస్థల్లో అదనపు ఉపాధి కల్పించే యజమానులకు ఒక్కో ఉద్యోగిపై నెలకు రూ.3,000 చొప్పున రెండేళ్ల పాటు కేంద్రం సాయం అందిస్తుంది. మరీ ముఖ్యంగా తయారీ రంగానికి ఈ మద్దతును మరో రెండేళ్ల పాటు పొడిగించనున్నట్లు తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో ఈ పథకం అమలు ద్వారా ఇప్పటికే గణనీయమైన ఫలితాలు వచ్చాయని వై.డి. శ్రీనివాస్ గణాంకాలను విడుదల చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 57,544 మంది ఉద్యోగులకు రూ.30.72 కోట్లు నేరుగా వారి ఖాతాల్లో జరిగాయి. అలాగే అదనపు ఉపాధి కల్పించిన 3,674 మంది యజమానులకు రూ.105.60 కోట్ల ప్రోత్సాహకాలు అందాయి. మొత్తంగా రాష్ట్రంలో 61,218 మంది లబ్ధిదారులకు రూ.136.32 కోట్ల మేర ప్రయోజనం చేకూరింది. దేశవ్యాప్తంగా చూసుకుంటే.. మార్చి 2026 నాటికి మొదటిసారి ఉద్యోగాల్లో చేరిన 4.41 లక్షల మందికి రూ.247 కోట్లు, యాజమాన్యాల ద్వారా ఉపాధి పొందిన 6.46 లక్షల మందికి రూ.214 కోట్ల ప్రోత్సాహకాలు విడుదలైనట్లు కమిషనర్ వివరించారు. దేశ ఆర్థికాభివృద్ధిలో, ‘వికసిత్ భారత్’ లక్ష్య సాధనలో ఈ రోజ్‌గార్ యోజన అత్యంత కీలక మైలురాయిగా నిలుస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ విలేకరుల సమావేశంలో భవిష్యనిధి శాఖకు చెందిన పలువురు ఉన్నతాధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular