దమ్మన్నపేట సర్పంచ్ దుబాసి నవీన్
వరంగల్ వాయిస్, దామెర : “గ్రామ ప్రజల ఆపదలో ఎల్లప్పుడూ ముందుండి అండగా ఉంటాను” అని దమ్మన్నపేట గ్రామ సర్పంచ్ దుబాసి నవీన్ స్పష్టం చేశారు. దామెర మండలంలోని దమ్మన్నపేట గ్రామానికి చెందిన నిరుపేద మహిళ లచ్చమ్మ నివాసం ఉంటున్న రేకుల ఇల్లు ఇటీవల వీచిన ఈదురు గాలుల కారణంగా పూర్తిగా దెబ్బతింది. రాబోయే వర్షాలకు ఇల్లు కురిసి లోపలికి నీరు వస్తుందని, ఉండటానికి నీడ లేదని ఆమె భయాందోళన వ్యక్తం చేశారు. ఈ విషయం తెలుసుకున్న సర్పంచ్ దుబాసి నవీన్ వెంటనే బాధితురాలి ఇంటికి వెళ్లి పరిస్థితిని క్షేత్రస్థాయిలో పరిశీలించారు. లచ్చమ్మను పరామర్శించి, ఆమెకు తక్షణ సహాయంగా సొంత నిధుల నుండి ఆర్థిక సహాయాన్ని అందజేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ.. ప్రస్తుత వర్ష కాలంలో ఇబ్బంది పడకుండా ఈ ఆర్థిక సాయంతో ఇంటి పైకప్పును త్వరితగతిన మరమ్మతు (రిపేర్) చేసుకోవాలని లచ్చమ్మకు సూచించారు. ఇల్లే కాకుండా భవిష్యత్తులో ఆమెకు ఎలాంటి అవసరం వచ్చినా మరింత సహాయాన్ని అందించేందుకు తాను సిద్ధంగా ఉన్నానని భరోసా ఇచ్చారు. సకాలంలో స్పందించి పేద కుటుంబానికి అండగా నిలిచిన సర్పంచ్ మానవతా దృక్పథాన్ని, సేవా గుణాన్ని దమ్మన్నపేట గ్రామ ప్రజలు ప్రత్యేకంగా అభినందించారు. “గ్రామంలో ఎవరికి ఏ కష్టం వచ్చినా నా వంతు సహాయం అందిస్తాను. లచ్చమ్మ ఇల్లు దెబ్బతిన్న విషయం తెలియగానే తక్షణ సాయం అందించాం. వర్షాలకు ఇబ్బంది కలగకుండా ఇల్లు త్వరగా బాగు చేయిస్తాం.” అని దమ్మన్నపేట సర్పంచ్ దుబాసి నవీన్ అన్నారు. ఈ మానవతా కార్యక్రమంలో దమ్మన్నపేట మాజీ సర్పంచ్ పాండవుల బిక్షపతి, ఉప సర్పంచ్ పాండవుల రాజు, దుబాసి అనిల్, స్థానిక నాయకులు నరసింహారెడ్డి, రాజిరెడ్డి, బాలయ్య, గ్రామస్తులు పాల్గొన్నారు.
