మిల్లర్ బూరుగుల రామచంద్రరావు
వరంగల్ వాయిస్, దామెర : “గత రెండు మూడు సంవత్సరాలుగా ఐకేపీ కేంద్రాల ద్వారా వచ్చే ధాన్యం కొనుగోలు, మిల్లింగ్ ప్రక్రియల వల్ల రైస్ మిల్లర్లు విపరీతంగా నష్టపోతున్నారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి తగిన చర్యలు తీసుకోకపోతే మిల్లులు మూతపడటం ఖాయం” అని దామెర మండల కేంద్రంలోని శ్రీ లక్ష్మీ గణపతి రైస్ మిల్ అధినేత బూరుగుల రామచంద్రరావు ఆవేదన వ్యక్తం చేశారు. హనుమకొండ జిల్లా దామెర మండలంలో ఆయన బుధవారం విలేకరులతో మాట్లాడారు. రైస్ మిల్లుల ప్రస్తుత దయనీయ స్థితిని వివరిస్తూ బూరుగుల రామచంద్రరావు పలు కీలక విషయాలను వెల్లడించారు. గత రెండు మూడేళ్లుగా ధాన్యం నాణ్యత సరిగ్గా లేకపోవడం వల్ల దిగుబడి బాగా పడిపోయిందని తెలిపారు. ఖరీఫ్‌లో కేవలం 55 శాతం, రబీలో 45 శాతం మాత్రమే దిగుబడి వస్తోందన్నారు. తగ్గుతున్న దిగుబడి వల్ల దాదాపు ఒక లారీ ధాన్యానికి రూ.3.50 లక్షల నుండి రూ.4 లక్షల రూపాయల వరకు మిల్లర్లు సొంతంగా నష్టపోవాల్సి వస్తోందని పేర్కొన్నారు. దీనివల్ల ప్రతి రైస్ మిల్లు పరిస్థితి ప్రస్తుతం అత్యంత అధ్వానంగా తయారైందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం మొదటగా అధికారికంగా ‘టెస్ట్ మిల్లింగ్’ నిర్వహించి, దాని ఆధారంగా వచ్చే నిష్పత్తిలోనే బియ్యాన్ని సేకరిస్తేనే మిల్లర్ల మనుగడ సాధ్యమవుతుందని స్పష్టం చేశారు. లేనిపక్షంలో, ప్రభుత్వమే ఈ రైస్ మిల్లులను లీజు పద్ధతిలో తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం నేరుగా రైతుల ధాన్యాన్ని మిల్లింగ్ చేయించి ఎఫ్‌సీఐకి అప్పగించుకోవాలని, తమ మిల్లులకు సరిపడా లీజు బకాయిలను చెల్లించి యజమానులను కాపాడాలని కోరారు. ప్రస్తుతం మార్కెట్‌లో రైస్ మిల్లర్ల పరిస్థితి రోజురోజుకూ దిగజారిపోతోంది. ప్రభుత్వం మా ఇబ్బందులను గమనించి, తక్షణమే టెస్ట్ మిల్లింగ్ ద్వారా మమ్మల్ని ఆదుకోవాలి. లేనిపక్షంలో మిల్లులకు తాళాలు వేసుకోవడం మినహా మాకు మరో మార్గం లేదని బూరుగుల రామచంద్రరావు అన్నారు.
