కలెక్టర్ చాహత్ బాజ్‌పాయికి వినతి
17న నల్ల బ్యాడ్జీలతో నిరసనలు..
మే 5న సామూహిక దీక్షలు
వరంగల్ వాయిస్, హనుమకొండ : ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు మరియు పెన్షనర్ల దీర్ఘకాలిక పెండింగ్ సమస్యల పరిష్కారం కోసం ఉమ్మడి కార్యాచరణతో పోరాడాలని ఉద్యోగ సంఘాల జేఏసీ నిర్ణయించింది. బుధవారం జేఏసీ చైర్మన్, టీఎన్జీవోస్ జిల్లా అధ్యక్షుడు ఆకుల రాజేందర్ ఆధ్వర్యంలో నేతలు జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్‌పాయిని కలిసి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా జేఏసీ నేతలు మాట్లాడుతూ.. తమ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం ఈనెల 17న జిల్లావ్యాప్తంగా నిరసనలు చేపట్టనున్నట్లు ప్రకటించారు. అన్ని మండల కేంద్రాలు, కలెక్టరేట్ వద్ద భోజన విరామ సమయంలో నల్ల బ్యాడ్జీలతో నిరసన ప్రదర్శనలు నిర్వహిస్తారు. ఈ కార్యక్రమానికి డీటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు లింగారెడ్డి, నాలుగో తరగతి ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు దాస్య నాయక్ ఇంచార్జిలుగా వ్యవహరిస్తారు.
మే 5న జిల్లా కేంద్రాల్లో సామూహిక దీక్షలు చేపట్టి నిరసనను ఉధృతం చేస్తారు. రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగుల పట్ల సానుకూలంగా స్పందించి జూన్ 2వ తేదీలోపు కొత్త పీఆర్సీని వెంటనే ప్రకటించాలి. బకాయి ఉన్న అన్ని బిల్లులు, డిఏలను విడుదల చేయాలి. నగదు రహిత చికిత్స కోసం హెల్త్ కార్డుల జారీ ప్రక్రియను పూర్తి చేయాలి. పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరిస్తూ సీపీఎస్‌ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ నిరసన కార్యక్రమాల్లో రెగ్యులర్ ఉద్యోగులతో పాటు ఉపాధ్యాయులు, పెన్షనర్లు, కాంట్రాక్ట్ మరియు అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని ఆకుల రాజేందర్ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జేఏసీ నాయకులు ఆకవరపు శ్రీనివాస కుమార్, బైరి సోమయ్య, అన్వర్, పెండెం రాజు, కె. శ్రీనివాస్, సర్వర్ హుస్సేన్, పుల్లూరు వేణుగోపాల్, పనికేల రాజేష్, శ్రీనివాస్ రెడ్డి, రాము నాయక్, కోమల్ రెడ్డి, భాను ప్రకాష్ రెడ్డి పాల్గొన్నారు. అలాగే సబీర్, సీతారాం, సరస్వతి, శ్యాంసుందర్, మల్లారెడ్డి, రవిప్రకాష్, విజయ్ కుమార్, రాజమౌళి, రజిత, నాగరాణి, అశోక్, ప్రణయ్, పృథ్వి తదితరులు పాల్గొని మద్దతు తెలిపారు.
