రూ.5.4 కోట్లతో మౌలిక వసతులకు శంకుస్థాపన
విద్యార్థుల సౌకర్యాలే ప్రథమ ప్రాధాన్యం
వైస్ ఛాన్సలర్ ఆచార్య కే. ప్రతాప్ రెడ్డి
హాజరైన టీజీఎస్సీహెచ్ఈ చైర్మన్ ప్రొఫెసర్ బాలకిష్టా రెడ్డి
వరంగల్ వాయిస్, కేయూ క్యాంపస్ : కాకతీయ విశ్వవిద్యాలయ విద్యార్థుల చిరకాల వాంఛలను నెరవేరుస్తూ క్యాంపస్‌లో భారీ మౌలిక సదుపాయాల అభివృద్ధి పనులకు బుధవారం శ్రీకారం చుట్టారు. ఉపకులపతి ఆచార్య కే.ప్రతాప్ రెడ్డి మూడు కీలక అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యామండలి (TGSCHE) చైర్మన్ ప్రొఫెసర్ బాలకిష్టా రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. విశ్వవిద్యాలయ అభివృద్ధి అధికారి ఆచార్య ఎన్. వాసుదేవ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. సుమారు రూ.5.40 కోట్ల అంచనా వ్యయంతో ఈ క్రింది పనులు చేపట్టనున్నారు. రూ.3.5 కోట్ల వ్యయంతో ఒకేసారి 500 మంది విద్యార్థులు భోజనం చేసేలా అత్యాధునిక భోజనశాల నిర్మాణం. రూ.70 లక్షలతో 2.5 లక్షల లీటర్ల సామర్థ్యం గల ఓవర్‌హెడ్ స్టోరేజ్ రిజర్వాయర్ (నీటి ట్యాంక్) నిర్మాణం. స్పోర్ట్స్ హాస్టల్ నుంచి కేయూ ఇంజినీరింగ్ కళాశాల వరకు రూ.1.20 కోట్ల వ్యయంతో నూతన సీసీ రోడ్డు నిర్మాణం. ఈ సందర్భంగా విసి ఆచార్య కే. ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ.. విద్యార్థులకు మెరుగైన వసతులు కల్పించడమే తమ ప్రాధాన్యతని తెలిపారు. ఈ కొత్త ప్రాజెక్టులు పూర్తయితే క్యాంపస్‌లో తాగునీరు, రవాణా, భోజన సౌకర్యాలు గణనీయంగా మెరుగుపడతాయని, ఇది విద్యా వాతావరణాన్ని మరింత బలోపేతం చేస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సభ్యులు ప్రొఫెసర్ బి. సురేష్‌లాల్, డాక్టర్ ఎన్.సుదర్శన్, ప్రొఫెసర్ మల్లం నవీన్, డాక్టర్ చిర్రా రాజు పాల్గొన్నారు. వీరితో పాటు రిజిస్ట్రార్ ప్రొఫెసర్ వి. రామచంద్రం, ఓఎస్‌డీ ప్రొఫెసర్ బైరు వెంకట్రామ్ రెడ్డి, యూనివర్సిటీ కాలేజ్ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ టి.మనోహర్, ఇంజినీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎన్.రమణ, హాస్టల్ డైరెక్టర్లు డాక్టర్ పి.శ్రీనివాస్, డాక్టర్ కె.సుమలత, అధ్యాపక, అధ్యాపకేతర సిబ్బంది పాల్గొన్నారు.
