వైస్ ఛాన్సలర్ ఆచార్య కె. ప్రతాప్‌రెడ్డి అధ్యక్షతన చర్చలు
అర్హత ప్రమాణాలు, దరఖాస్తు రుసుముపై నిర్ణయం
వరంగల్ వాయిస్, కేయూ క్యాంపస్ : తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న విశ్వవిద్యాలయాల్లో పీజీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే టీజీ సీపీజీట్ (TG CPGET) – 2026 నిర్వహణపై కాకతీయ విశ్వవిద్యాలయంలో బుధవారం కీలక సమావేశం జరిగింది. విశ్వవిద్యాలయ కమిటీ హాల్‌లో జరిగిన ఈ సన్నాహక సమావేశానికి టీజీ సీపీజీట్ – 2026 చైర్మన్, కేయూ వైస్ ఛాన్సలర్ ఆచార్య కె. ప్రతాప్‌రెడ్డి అధ్యక్షత వహించారు. ఈ సమావేశంలో పీజీ ప్రవేశ పరీక్షలకు సంబంధించిన పలు కీలక అంశాలపై చర్చించినట్లు కన్వీనర్ ఆచార్య రాజేందర్ కట్ల ఒక ప్రకటనలో తెలిపారు. వివిధ కోర్సుల్లో ప్రవేశాలకు ఉండాల్సిన విద్యార్హతలపై స్పష్టతనిచ్చారు. అభ్యర్థులు చెల్లించాల్సిన దరఖాస్తు ఫీజు వివరాలను చర్చించారు. పరీక్షల నిర్వహణ తేదీలు, దరఖాస్తుల స్వీకరణ గడువు వంటి షెడ్యూల్‌పై అధికారులతో సమీక్షించారు. ఈ సమావేశంలో కేయూ రిజిస్ట్రార్ ఆచార్య వి.రామచంద్రం, సోషల్ సైన్సెస్ డీన్ ఆచార్య బి.సురేష్‌లాల్, సైన్స్ డీన్ ఆచార్య జి.హనుమంతు, ఓఎస్డీ ఆచార్య బి.వెంకట్రామరెడ్డి పాల్గొన్నారు. అలాగే టీజీ సీపీజీట్ – 2025 పూర్వ కన్వీనర్ ఆచార్య పాండురంగ రెడ్డి, క్యాంపస్ కాలేజీ ప్రిన్సిపాల్ ఆచార్య టి.మనోహర్, ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీ ప్రిన్సిపాల్ ఆచార్య ఎస్.జ్యోతి, అడ్మిషన్ల డైరెక్టర్ ఆచార్య సి.జె.శ్రీలత, స్పోర్ట్స్ బోర్డు కార్యదర్శి ఆచార్య వై.వెంకయ్య తదితరులు పాల్గొని తమ సూచనలు అందజేశారు.
