భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర
నూర్జహాన్పల్లిలో బతుకమ్మ విగ్రహావిష్కరణ
వరంగల్ వాయిస్, శాయంపేట : తెలంగాణ విశిష్ట సంస్కృతి, సంప్రదాయాలకు బతుకమ్మ పండుగ నిలువెత్తు ప్రతీక అని భూపాలపల్లి శాసనసభ్యులు గండ్ర సత్యనారాయణరావు కొనియాడారు. శనివారం శాయంపేట మండలం నూర్జహాన్పల్లి గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన బతుకమ్మ విగ్రహాన్ని ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరై ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే గండ్ర మాట్లాడుతూ… తెలంగాణ ప్రజలు ఎంతో భక్తిశ్రద్ధలతో జరుపుకునే పండుగల్లో ‘సద్దుల బతుకమ్మ’, ‘దసరా’ వేడుకలకు ప్రత్యేక విశిష్టత ఉందన్నారు. బతుకమ్మ పండుగ మన ఆడపడుచుల ఆత్మగౌరవానికి, ఐక్యతకు, ప్రకృతితో ముడిపడిన జీవన విధానానికి ఆనవాలుగా నిలుస్తుందని పేర్కొన్నారు. గ్రామాల్లో ఇటువంటి బతుకమ్మ విగ్రహాలను ఏర్పాటు చేసి వేడుకలు నిర్వహించడం ద్వారా మన ప్రాచీన సంస్కృతీ సంప్రదాయాలను భావితరాలకు అందించవచ్చని తెలిపారు. తెలంగాణ సంస్కృతిని గౌరవిస్తూ పండుగలను అందరూ సామరస్యంతో, ఐకమత్యంతో జరుపుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు దూదిపాల బుచ్చిరెడ్డి, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ మారేపల్లి రవీందర్, గ్రామ సర్పంచ్ అల్లే రాజీరు, ఉప సర్పంచ్ హేమ నాయక్, పార్టీ సీనియర్ నాయకులు దుబాసి కృష్ణమూర్తిలతో పాటు పలువురు వార్డు సభ్యులు, స్థానిక నాయకులు, ప్రజలు పాల్గొన్నారు.
