రాపోలు వీర మోహన్
వరంగల్ వాయిస్, (వరంగల్, కొత్తవాడ): రాష్ట్రంలోని పద్మశాలీలు, చేనేత కార్మికులందరూ తమ హక్కుల సాధన కోసం ఏకం కావాలని తెలంగాణ చేనేత ఐక్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు రాపోలు వీర మోహన్ పిలుపునిచ్చారు. వరంగల్ కొత్తవాడలోని చేనేత సహకార సంఘాలను సందర్శించిన ఆయన, మగ్గాలను పరిశీలించి కార్మికుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా రాపోలు మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన కొత్త టెండరింగ్ విధానం చేనేత కార్మికుల పొట్ట కొట్టేలా ఉందని మండిపడ్డారు.టెండర్ విధానాన్ని వెంటనే రద్దు చేసి, పాత పద్ధతిలోనే చేనేత నిల్వలను కొనుగోలు చేయాలి. ప్రభుత్వం స్పందించకుంటే రాష్ట్రవ్యాప్తంగా కార్మికులను సంఘటితం చేసి భారీ ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. ఐక్యవేదిక రాష్ట్ర మీడియా కార్యదర్శి లింగమూర్తి మాట్లాడుతూ.. మార్కెటింగ్ లేకపోవడం, ముడిసరుకుల ధరల పెరుగుదల, బకాయిల ఆలస్యంతో నేతన్నలు కుదేలవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. టెండర్ల వల్ల ఆర్డర్లు పెద్ద కంపెనీల పాలై, సహకార వ్యవస్థ నిర్వీర్యమవుతోందని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో సంఘం అధ్యక్షులు మధనయ్య, రాష్ట్ర ఉపాధ్యక్షులు చెరుకు మల్లయ్య, వేముల ఉమా రాణి, గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షులు ఏలే మహేష్ నేత, ఇతర ముఖ్య నాయకులు, కార్మికులు పాల్గొన్నారు.
