ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి
పార్టీలకతీతంగా అర్హులందరికీ సంక్షేమ ఫలాలు
సీఎంఆర్ఎఫ్, కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ
వరంగల్ వాయిస్, దామెర: అర్హులైన ప్రతి పేదవాడికి సంక్షేమ పథకాలు అందజేయడమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం పనిచేస్తోందని పరకాల శాసనసభ్యులు రేవూరి ప్రకాశ్ రెడ్డి అన్నారు. మంగళవారం ఆత్మకూరు మండలంలోని జి.ఎస్.ఆర్ గార్డెన్లో నిర్వహించిన కార్యక్రమంలో దామెర మండలానికి చెందిన ముఖ్యమంత్రి సహాయ నిధి, కళ్యాణ లక్ష్మి మరియు షాదీ ముబారక్ చెక్కులను లబ్ధిదారులకు ఆయన పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ..దామెర మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన 24 మంది లబ్ధిదారులకు రూ.10,01,750 విలువ గల సీఎంఆర్ఎఫ్ చెక్కులను, అలాగే 11 మంది లబ్ధిదారులకు రూ.11,12,376 విలువైన కళ్యాణ లక్ష్మి చెక్కులను అందజేశారు. రాష్ట్ర ప్రభుత్వం మహిళల అభివృద్ధికి పెద్దపీట వేస్తోందని, వారిని ఆర్థికంగా బలోపేతం చేసేందుకు అనేక పథకాలను ప్రవేశపెట్టిందని కొనియాడారు. పార్టీలతో సంబంధం లేకుండా అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సాయం అందుతుందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో హనుమకొండ ఆర్డీవో కె. నారాయణ, దామెర తహసీల్దార్ జ్యోతి వరలక్ష్మి దేవి, జీపీఓ హరిప్రసాద్,కాంగ్రెస్ మండల అధ్యక్షుడు మన్నెం ప్రకాశ్ రెడ్డి, మండల సర్పంచులు పోలేపాక శ్రీనివాస్, బొంకూరి రవి యాదవ్, దాసి శ్రీకాంత్, సీనియర్ నాయకులు దుబాసి రాజేందర్, ఇతర కార్యకర్తలు, లబ్ధిదారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకుని పేదలు అభివృద్ధి చెందాలని ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆకాంక్షించారు.
