Saturday, May 9, 2026
HomeHanamkondaకే.యూలో జీవ విజ్ఞాన కేంద్రం త్వరలో ప్రారంభం

కే.యూలో జీవ విజ్ఞాన కేంద్రం త్వరలో ప్రారంభం

📰 Generate e-Paper Clip

  • ప్రారంభించిన వీసీ ప్రో ప్రతాప్ రెడ్డి

వరంగల్ వాయిస్ కే.యూ క్యాంపస్ :  జీవశాస్త్రం–ఔషధ శాస్త్రంలో పరిశోధనలకు కొత్త దిశ… కృత్రిమ మేధ మనుషులను భర్తీ చేయదు: కేయూ ఉప కులపతి స్పష్టం…. కాకతీయ విశ్వవిద్యాలయంలో జీవశాస్త్ర రంగంలోని పురోగతులపై నిర్వహిస్తున్న జాతీయ సదస్సు ప్రారంభోత్సవం మంగళవారం జంతు శాస్త్ర విభాగంలో ఘనంగా జరిగింది. జాతీయ సదస్సు ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఉప కులపతి ప్రొఫెసర్ కర్నాటి ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ, విశ్వవిద్యాలయంలో త్వరలో “జీవ విజ్ఞాన కేంద్రం, ఔషధ శాస్త్ర కేంద్రం మరియు అనుబంధ శాస్త్రాల కేంద్రం” స్థాపనకు ప్రతిపాదనలు సిద్ధమయ్యాయని తెలిపారు. అవసరమైన అనుమతులు లభించిన వెంటనే ఈ కేంద్రాన్ని ప్రారంభించి జీవశాస్త్రం, ఔషధ శాస్త్రం, అనుబంధ రంగాలలో ఉన్నత స్థాయి పరిశోధనలకు వేదికగా అభివృద్ధి చేస్తామని చెప్పారు. ఈ కేంద్రం ద్వారా విద్యార్థులు, పరిశోధకులు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన ప్రయోగశాలల్లో పనిచేసే అవకాశాలు పొందుతారని, అంతరశాఖ సహకారంతో కొత్త ఆవిష్కరణలు వెలువడే అవకాశాలు పెరుగుతాయని పేర్కొన్నారు. ముఖ్యంగా ప్రజారోగ్యం, ఔషధ అభివృద్ధి, పర్యావరణ సంరక్షణ వంటి కీలక రంగాల్లో పరిశోధనలకు ఈ కేంద్రం దోహదపడుతుందని తెలిపారు. గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాల అవసరాలకు అనుగుణంగా ప్రయోజనకరమైన పరిశోధనలను ప్రోత్సహించడమే లక్ష్యమని స్పష్టం చేశారు.

ప్రస్తుతం కృత్రిమ మేధ వేగంగా అభివృద్ధి చెందుతున్నదని, అయితే అది మనుషులను భర్తీ చేయలేదని ఆయన అన్నారు. మనుషుల ఆలోచనలు, సూచనలు, మార్గదర్శకత ఆధారంగానే కృత్రిమ మేధ పనిచేస్తుందని వివరించారు. అందువల్ల విద్యార్థులు ప్రాథమిక శాస్త్రాలపై పట్టు సాధిస్తూ సృజనాత్మక ఆలోచనలను పెంపొందించుకోవాలని సూచించారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని సమర్థవంతంగా వినియోగిస్తూ సమాజానికి ఉపయోగపడే పరిశోధనలపై దృష్టి సారించాలని పిలుపునిచ్చారు. మొదటి రోజు జరిగిన జాతీయ సదస్సులో హైదరాబాద్ విశ్వవిద్యాలయానికి చెందిన డా. కర్నాటి రాయ్ కీలకోపన్యాసం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మెదడు కణజాలంలో ఏర్పడే గ్లియోమా వ్యాధిలో కనిపించే ఒక ముఖ్యమైన జీవరసాయన మార్పు గురించి వివరించారు. ప్రత్యేకంగా ఒక కార్బన్ జీవక్రియ విధానం ఎలా మార్పులకు లోనవుతుందో, ఆ మార్పులు కణాల పెరుగుదలపై మరియు వ్యాధి తీవ్రతపై ఎలా ప్రభావం చూపుతాయో వివరించారు. కొన్ని రకాల గ్లియోమా వ్యాధుల్లో ఈ మార్పులు రోగులకు కొంతమేర అనుకూల ఫలితాలను ఇవ్వగలిగినా, కొన్ని సందర్భాల్లో వ్యాధి తీవ్రత పెరగడానికి తెలిపారు.

ఈ నేపథ్యంలో జీవక్రియలో జరిగే మార్పులను ఆధారంగా తీసుకుని ప్రమాద స్థాయిని గుర్తించవచ్చని పేర్కొన్నారు. అలాగే ఆధునిక గణన పద్ధతులు, యాంత్రిక అధ్యయన విధానాలను ఉపయోగించి ఇప్పటికే ఉన్న ఔషధాలలో కొత్త ఉపయోగాలను గుర్తించే ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలిపారు. ఈ విధానాల ద్వారా లక్ష్యిత చికిత్సలను అభివృద్ధి చేసి, వ్యాధి తీవ్రతను తగ్గించే అవకాశాలు ఉన్నాయని వివరించారు. ఈ పరిశోధన ద్వారా అధిక ప్రమాద స్థాయిలో ఉన్న రోగులను ముందుగానే గుర్తించడం మరియు వారికి తగిన విధంగా ప్రత్యేక చికిత్స అందించడం సాధ్యమవుతుందని చెప్పారు. భవిష్యత్తులో వ్యక్తిగత వైద్య విధానాల అభివృద్ధికి ఈ అధ్యయనం ఉపయోగపడుతుందని అభిప్రాయపడ్డారు. జాతీయ సదస్సు నిర్వాహక కార్యదర్శి ప్రో మామిడాల ఇస్తారీ మాట్లాడుతూ, జాతీయ సదస్సు కొరకు 150 కి పైగా పరిశోధనా పత్రాలు దేశంలోని వివిధ యూనివర్సిటీల నుండి వచ్చాయని, రెండు రోజుల పాటు జరిగే జాతీయ సదస్సులో మాలిక్యులర్ బయాలజీ, బయో ఇన్ఫర్మాటిక్స్, ఇతర లైఫ్ సైన్సెస్ విషయాల పై పరిశోధనా పత్రాల ప్రజెంటేషన్ జరుగుతాయని తెలిపారు. ఈ కార్యక్రమానికి జువాలజీ విభాగ అధిపతి ప్రో వెంకయ్య అధ్యక్షత వహించగా, కేయూ కాలేజీ ప్రిన్సిపాల్ ప్రో. మనోహర్ విశిష్ట అతిథిగా పాల్గొన్నారు. ఆ విభాగ ఆచార్యులు ప్రో. షమిత, ప్రో. మామిడాల ఇస్తారీ, ప్రో. నారాయణ లు పాల్గొన్నారు.

ku News

RELATED ARTICLES

Most Popular