రంజిత్ రెడ్డి జన్మదినం సందర్భంగా సేవా కార్యక్రమాలు
హాజరైన హరీష్ రావు, దాస్యం వినయ్ భాస్కర్
వరంగల్ వాయిస్, హనుమకొండ: పార్టీ కోసం నిరంతరం కష్టపడి పనిచేసే ప్రతి ఒక్క కార్యకర్తను గుండెల్లో పెట్టుకుని కాపాడుకుంటామని మాజీ మంత్రి, బీఆర్ఎస్ సీనియర్ నేత తన్నీరు హరీష్ రావు స్పష్టం చేశారు. ఆదివారం బాలసముద్రంలోని బీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయంలో బీఆర్ఎస్ యూత్ నాయకుడు రెడ్డిపురం రంజిత్ రెడ్డి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని పేద విద్యార్థులకు ఆర్థిక సహాయం, స్కూల్ బ్యాగుల పంపిణీ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి హరీష్ రావు, మాజీ ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ ముఖ్య అతిథులుగా హాజరై, విద్యార్థులకు స్వహస్తాలతో ఆర్థిక సాయం, బ్యాగులను అందజేశారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ.. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు తోడుగా నిలిచిన ప్రతి కార్యకర్తకూ అండగా ఉంటామని హామీ ఇచ్చారు. “ప్రతిపక్ష పార్టీలు ఎన్ని ఇబ్బందులకు గురిచేసినా, భయపడాల్సిన అవసరం లేదు. బీఆర్ఎస్ పార్టీ ఎల్లప్పుడూ మీకు రక్షణగా ఉంటుంది.” అని కార్యకర్తలకు భరోసా ఇచ్చారు. కష్టాల్లో ఉన్న పార్టీ కార్యకర్తల పిల్లల చదువుల కోసం, సుమారు 500 మందికి పైగా విద్యార్థులకు ఇంత పెద్ద ఎత్తున ఆర్థిక సహాయం అందించడం అభినందనీయమని రంజిత్ రెడ్డిని హరీష్ రావు ప్రత్యేకంగా ప్రశంసించారు. భవిష్యత్తులో రంజిత్ రెడ్డి మరిన్ని ఇలాంటి సామాజిక సేవా కార్యక్రమాలు చేపట్టాలని ఆకాంక్షిస్తూ, పార్టీ పరంగా అతనికి అన్ని విధాలా మద్దతు ఉంటుందని తెలిపారు. మాజీ ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ మాట్లాడుతూ.. పేద పిల్లల చదువుల కోసం ఇంత పెద్ద ఎత్తున స్వచ్ఛందంగా ముందుకు వచ్చి సహాయం చేస్తున్న రంజిత్ రెడ్డి సేవా గుణాన్ని కొనియాడారు. అనంతరం యువతను ఉద్దేశించి మాట్లాడుతూ, అధికార పార్టీ ఎన్ని ఇబ్బందులు పెట్టినా పార్టీ శ్రేణులు ధైర్యంగా ఉండాలని, నాయకత్వం ఎల్లప్పుడూ వెన్నంటి ఉంటుందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా రెడ్డిపురం రంజిత్ రెడ్డి జన్మదిన వేడుకలను నాయకులు, కార్యకర్తలు ఘనంగా నిర్వహించారు. ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తూ అభినందించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి సత్యవతి రాథోడ్, మాజీ ఎమ్మెల్యేలు పెద్ది సుదర్శన్ రెడ్డి, అరూరి రమేష్, మాజీ రాష్ట్ర చైర్మన్లు ఎర్రోళ్ల శ్రీనివాస్, లింగంపల్లి కిషన్ రావు, మాజీ కుడా చైర్మన్ మర్రి యాదవ రెడ్డి, రాష్ట్ర నాయకులు సాంబరి సమ్మరావు, హరి రమాదేవిలతో పాటు మాజీ కార్పొరేటర్లు, డివిజన్ ప్రెసిడెంట్లు, యువత, పార్టీ కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.
