ల్యాదల్లలో ‘రుద్రమ’ బ్రాండ్ ఘన ప్రారంభం
వరంగల్ వాయిస్, దామెర : తెలంగాణ మహిళల ఆర్థిక స్వావలంబన, ఆత్మగౌరవానికి ప్రతీకగా దామెర మండలం ల్యాదేళ్ల గ్రామం సరికొత్త చరిత్రకు వేదికైంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోన్న ‘మహిళా శక్తి’ వారోత్సవాల సందర్భంగా.. ల్యాదేళ్లలో ఏర్పాటు చేసిన ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్, పరకాల స్కిల్ డెవలప్‌మెంట్ అండ్ మినీ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్‌ను పరకాల శాసనసభ్యులు రేవూరి ప్రకాశ్ రెడ్డి, ‘వీ హబ్’ సీఈవో సీతా పల్లాచోళ్లతో కలిసి ఆదివారం ఘనంగా ప్రారంభించారు. అనంతరం రూ.కోట్ల వ్యయంతో నిర్మించనున్న ఎస్ హెచ్ జి వివో, వర్క్ షెడ్, జీ ఎం డైరీ, ఆధునిక సమావేశ మందిర భవనాలకు వారు ఘనంగా శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మహిళా సమైక్య సభ్యులతో ఏర్పాటు చేసిన సదస్సులో ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి మాట్లాడుతూ.. ల్యాదల్ల గ్రామంలో ‘రుద్రమ’ బ్రాండ్ పేరుతో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ ప్రారంభం కావడం యావత్ తెలంగాణ మహిళా లోకానికి గర్వకారణమన్నారు. “ఎన్ని అడ్డంకులు ఎదురైనా వీరోచితంగా పోరాడిన కాకతీయ వీరనారి రాణి రుద్రమదేవి చరిత్రను గుర్తుచేసేలా, ఇక్కడి ఉత్పత్తులకు ‘రుద్రమ’ అని పేరు పెట్టడం శుభపరిణామం. మహిళల్లో ఉన్న అంకితభావం, నిబద్ధతే ఈ బ్రాండ్ విజయానికి పునాది కావాలి. నాణ్యమైన ఉత్పత్తులను తయారుచేసి ఈ బ్రాండ్‌కు దేశవ్యాప్త గుర్తింపు తీసుకురావాలి.” అని పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి అన్నారు. గ్రామీణ ప్రాంత మహిళలకు నైపుణ్యాభివృద్ధి శిక్షణ ఇవ్వడం, స్థానికంగానే ఉపాధి కల్పించడమే ధ్యేయంగా జిల్లా యంత్రాంగం, తెలంగాణ మహిళా పారిశ్రామికవేత్తల హబ్ సంయుక్తంగా ఈ మినీ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్‌ను అభివృద్ధి చేస్తున్నాయని ఎమ్మెల్యే తెలిపారు. ఇక్కడి మహిళల మార్కెటింగ్ అవకాశాలను మెరుగుపరిచేందుకు ప్రభుత్వం నుంచి అన్ని రకాల సహకారాలు అందిస్తామని, ఉత్పత్తుల అమ్మకాలు పెంచేలా వీ హబ్ నిర్వాహకులు ప్రత్యేక కృషి చేయాలని కోరారు. మహిళల ఆర్థిక సాధికారతే సమాజ ప్రగతికి మూలస్తంభమని ఎమ్మెల్యే రేవూరి పేర్కొన్నారు. నిజాయితీ, నిబద్ధతలను పెట్టుబడిగా పెట్టి ల్యాదల్లలో త్వరలోనే ‘పరకాల ఇందిరా మహిళా పాల ఉత్పత్తిదారుల సహకార సమాఖ్య లిమిటెడ్’ను విజయవంతంగా నడిపిస్తామన్నారు. గ్రామంలో డైరీ ఏర్పాటు కల ఈరోజుతో నెరవేరినందుకు మహిళలు హర్షం వ్యక్తం చేశారు.ఈ గ్రాండ్ ఓపెనింగ్ కార్యక్రమంలో డీఆర్‌డీఓ (DRDO) శ్రీనివాస్, వీ హబ్ అసోసియేట్ డైరెక్టర్ శ్రీమతి ఊహ, ప్రాజెక్ట్ మేనేజర్ గురు ప్రసన్న, ప్రాజెక్ట్ కో-ఆర్డినేటర్ రూపానంద్, తహసిల్దార్ జ్యోతి వరలక్ష్మి దేవి, ఎంపీడీవో గుమ్మడి కల్పన, మండల వ్యవసాయ అధికారి అల్లే రాకేష్, స్థానిక సర్పంచ్ రవి యాదవ్, ఏపీఎం అశోక్, పంచాయతీ రాజ్ శాఖ డీఈ ఉపేందర్ పాల్గొన్నారు. అలాగే రాజకీయ ప్రముఖులు కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు దుబాసి రాజేందర్, మాజీ అధ్యక్షుడు ప్రకాష్ రెడ్డి, నాయకులు బిల్లా రమణారెడ్డి, బిక్షపతి, శ్రీధర్ రెడ్డి, రవీందర్ యాదవ్‌తో పాటు పెద్ద సంఖ్యలో మహిళా సంఘాల ప్రతినిధులు, ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ అధికారులు పాల్గొన్నారు.
