వరంగల్ వాయిస్, క్రైం :సైబర్ నేరాలు, ఆన్లైన్ మోసాల పట్ల ప్రజల్లో అవగాహన పెంపొందించి, వారిని అప్రమత్తం చేయాలనే లక్ష్యంతో వరంగల్ పోలీస్ కమిషనరేట్ సైబర్ క్రైమ్ ఏసీపీ వెంకటరమణ ఆధ్వర్యంలో శుక్రవారం సాయంత్రం కేయూ జంక్షన్ నుంచి హనుమకొండ పోలీస్ హెడ్‌క్వార్టర్స్ వరకు “ఫ్లాష్ వాక్” నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వరంగల్ పోలీస్ కమిషనర్ ఎన్. శ్వేత, ఐపీఎస్ ముఖ్య అతిధిగా పాల్గొని విద్యార్థులతో కలిసి నడిచారు. వివిధ కళాశాలలకు చెందిన సుమారు 1,200 మంది విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొనగా, సైబర్ నేరాల నివారణపై ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా సీపీ శ్వేత మాట్లాడుతూ.. ప్రస్తుత కాలంలో సైబర్ నేరగాళ్లు వివిధ మార్గాల్లో ప్రజలను మోసం చేస్తున్నారని, ప్రతి ఒక్కరూ సైబర్ భద్రతపై అవగాహన కలిగి అప్రమత్తంగా ఉండాలని సూచించారు. గుర్తుతెలియని వ్యక్తుల ఫోన్ కాల్స్, అనుమానాస్పద లింకులు, నకిలీ సందేశాలు, మోసపూరిత ఆన్లైన్ లావాదేవీల పట్ల జాగ్రత్తగా ఉండాలని తెలిపారు. విద్యార్థులు తమకు కలిగిన అవగాహనను తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు, స్నేహితులతో పంచుకుంటూ సమాజంలో సైబర్ భద్రతపై చైతన్యం కల్పించాలని పిలుపునిచ్చారు. ఫ్లాష్ వాక్ ద్వారా విద్యార్థులు సైబర్ నేరాల నివారణపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ, అప్రమత్తతే సైబర్ మోసాలకు అడ్డుకట్ట అనే సందేశాన్ని చాటిచెప్పారు.ఈ కార్యక్రమంలో సైబర్ క్రైమ్ ఏసీబీ వెంకటరమణ, సైబర్ క్రైమ్ ఇన్స్పెక్టర్ అశోక్ కుమార్, హన్మకొండ ఏసిపి నరసింహారావు, ట్రాఫిక్ ఏసిపి సత్యనారాయణ, హనుమకొండ డివిజన్, వరంగల్ డివిజన్ లకు చెందిన ఇన్స్పెక్టర్ లు, హన్మకొండ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్లు, సైబర్ క్రైమ్ ఎస్ఐలు ,వివిధ కళాశాలలకు చెందిన విద్యార్థులు పాల్గొన్నారు.
సైబర్ నేరాల నివారణకు ప్రజల్లో అవగాహన,అప్రమత్తమే కీలకం : వరంగల్ సీపీ శ్వేత
RELATED ARTICLES
