Monday, November 2, 2026
HomeHanamkondaనాకు న్యాయం చేయండి

నాకు న్యాయం చేయండి

📰 Generate e-Paper Clip

భూమి విషయంలో మోసం చేసి బెదిరిస్తున్నారు

న్యాయం చేయాలని పోలీసు ఉన్నతాధికారులకు బాధితురాలి వేడుకోలు

వరంగల్ వాయిస్, శాయంపేట: తనకు సంక్రమించిన 35 గుంటల భూమిని నమ్మించి కోడలి పేరుపై పట్టా మార్పిడి చేయించి, ప్రస్తుతం అదే భూమి విషయంలో తన కుటుంబాన్ని ఇబ్బందులకు గురిచేస్తూ బెదిరింపులకు పాల్పడుతున్నారని శాయంపేట మండలం మైలారం గ్రామానికి చెందిన నాలికె సరోజన ఆరోపించారు. తనకు న్యాయం చేయాలని కోరుతూ శాయంపేట మండల కేంద్రంలో విలేకరుల ఎదుట తన ఆవేదనను వ్యక్తం చేశారు.

నాలికె సరోజన తెలిపిన వివరాల ప్రకారం.. తన కుమారుడు నాలికె కుమారస్వామికి సుమారు 20 ఏళ్ల క్రితం కళ్యాణితో వివాహం జరిగిందని, వారికి ఇద్దరు కుమారులు ఉన్నారని తెలిపారు. అయితే భార్యాభర్తల మధ్య మనస్పర్థలు ఏర్పడటంతో కాపురం సజావుగా సాగడం లేదన్నారు. ఈ నేపథ్యంలో తన తమ్ముడు ఇచ్చిన సలహా మేరకు కోడలు కళ్యాణి తిరిగి కాపురానికి రావాలంటే ఆమె పేరుపై భూమి పట్టా చేయించాలని సూచించడంతో, తనకు చెందిన 35 గుంటల భూమిని కోడలి పేరుపై పట్టా చేయించినట్లు వెల్లడించారు. ఆ తర్వాత పబ్లిక్ గార్డెన్‌లో పంచాయతీ నిర్వహిస్తామని చెప్పి తమను అక్కడికి పిలిపించారని, అక్కడ ఎవరూ ఉండకూడదంటూ బెదిరించి తమతో సంతకాలు తీసుకున్నారని ఆరోపించారు. అనంతరం విడాకుల పత్రాలు పూర్తయ్యాయని చెప్పడంతో తాము పోలీసులను ఆశ్రయించినట్లు తెలిపారు. ప్రస్తుతం కోడలు కళ్యాణి ఓ గ్రామ పెద్దమనిషి సహకారంతో తమ భూమిని విక్రయించేందుకు ప్రయత్నిస్తున్నారని సరోజన ఆరోపించారు. తనను నమ్మించిన తమ్ముడే ఇప్పుడు భూమిని దక్కించుకునేందుకు ప్రయత్నిస్తున్నాడని, భూమిని అమ్మనివ్వకపోతే చంపేస్తానంటూ బెదిరిస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. తన తమ్ముడు ఏఎస్ఐగా విధులు నిర్వహిస్తున్నారని, తుపాకీతో కాల్చేస్తానని కూడా బెదిరిస్తున్నట్లు సంచలన ఆరోపణలు చేశారు. ఈ విషయంపై ఇటీవల పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు సరోజన తెలిపారు. ఫిర్యాదు మేరకు ఎస్ఐ తన తమ్ముడిని పోలీస్ స్టేషన్‌కు పిలిపించగా, ఈ వ్యవహారాన్ని కోర్టులోనే తేల్చుకుంటామని చెప్పి వెళ్లిపోయినట్లు వివరించారు. తమకు అండగా నిలిచేవారు ఎవరూ లేరని, న్యాయం కోసం ఎవరిని ఆశ్రయించాలో తెలియని పరిస్థితి నెలకొందని ఆమె కన్నీటి పర్యంతమయ్యారు. తన భూమిపై న్యాయబద్ధమైన హక్కులను కాపాడడంతో పాటు, తనను బెదిరిస్తున్నారన్న ఆరోపణలపై సమగ్ర విచారణ జరిపి, బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పోలీసు ఉన్నతాధికారులను నాలికె సరోజన వేడుకున్నా

రు.

RELATED ARTICLES

Most Popular