జెడ్పీ సీఈఓ శేషాద్రి
వరంగల్ వాయిస్, దామెర: అంగన్వాడీ కేంద్రాల ద్వారా అందించే సేవలతోనే గ్రామీణ ప్రాంతాల్లోని మహిళలు, చిన్నారుల ఆరోగ్యం మెరుగుపడుతుందని హనుమకొండ జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వాహణాధికారి శేషాద్రి అన్నారు. ‘ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక’ 99 రోజుల కార్యాచరణలో భాగంగా మంగళవారం ఆయన దామెర మండలంలోని లేదల్ల గ్రామంలో గల అంగన్వాడీ కేంద్రాన్ని ఆకస్మికంగా సందర్శించారు. కేంద్రంలో చిన్నారులకు అందిస్తున్న పౌష్టికాహారం, గర్భిణీలు మరియు బాలింతలకు అందుతున్న సేవలపై ఆయన ఆరా తీశారు. అంగన్వాడీ టీచర్లు నిర్వహిస్తున్న పూర్వ ప్రాథమిక విద్య తీరును పరిశీలించారు. ముఖ్యంగా హాజరు పట్టిక, స్టాక్ రిజిస్టర్‌లను తనిఖీ చేసి.. బియ్యం, పప్పులు, గుడ్ల నిల్వలు మరియు వాటి నాణ్యతను స్వయంగా పరిశీలించారు. నిల్వ ఉంచే గదులు పరిశుభ్రంగా ఉండాలని ఆదేశించారు. ఈ సందర్భంగా సీఈఓ శేషాద్రి మాట్లాడుతూ.. ప్రభుత్వం నిర్వహిస్తున్న సంక్షేమ వారోత్సవాల్లో భాగంగా అన్ని అంగన్వాడీ కేంద్రాల్లో ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాలను చేపట్టాలన్నారు. అంగన్వాడీ సిబ్బంది అంకితభావంతో పనిచేసి, క్షేత్రస్థాయిలో లబ్ధిదారులకు ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలను పూర్తిస్థాయిలో చేరవేయాలని సూచించారు. ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణంలో అంగన్వాడీల పాత్ర కీలకమని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో దామెర ఎంపీడీవో గుమ్మడి కల్పన, అంగన్వాడీ టీచర్లు, ఆయాలు, గ్రామస్తులు పాల్గొన్నారు.
