ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి
వరంగల్ వాయిస్, దామెర : మహిళలు అన్ని రంగాల్లో స్వయం సమృద్ధి సాధించి, ఆర్థికంగా బలోపేతం కావాలనేదే కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని పరకాల శాసనసభ్యులు రేవూరి ప్రకాశ్ రెడ్డి స్పష్టం చేశారు. బుధవారం దామెర మండలం ల్యాదేళ్ల గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేస్తున్న ‘వి హబ్ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్’ భవనాన్ని ఉన్నతాధికారులతో కలిసి ఆయన క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అనంతరం సెంటర్ పరిసర ప్రాంతాలను పరిశీలించి, పనులను వేగవంతం చేయాలని అధికారులకు సూచించారు. ఇదే క్రమంలో పరకాలలో ప్రతిష్టాత్మకంగా నిర్మించ తలపెట్టిన ‘ఇందిరా మహిళా సమాఖ్య’ భవన నిర్మాణానికి అవసరమైన స్థలాన్ని కూడా ఆయన అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి మాట్లాడుతూ.. గ్రామీణ మహిళల్లో దాగి ఉన్న నైపుణ్యాలను వెలికితీసి, వారికి తగిన ఉపాధి, వ్యాపార అవకాశాలను కల్పించేందుకే ఈ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ను ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు. ప్రభుత్వం కల్పిస్తున్న ఈ తరహా సాంకేతిక, వృత్తి విద్యా నైపుణ్య శిక్షణ అవకాశాలను మహిళలు పక్కాగా సద్వినియోగం చేసుకొని ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని పిలుపునిచ్చారు. సమాజంలో మహిళలు సొంతంగా వ్యాపారాలు ప్రారంభించి, మరో నలుగురికి ఉపాధి కల్పించే స్థాయికి ఎదిగేలా కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని రకాల సబ్సిడీలు, ప్రోత్సాహకాలను అందిస్తూ అండగా నిలుస్తుందని భరోసా ఇచ్చారు. ఈ అధికారిక క్షేత్రస్థాయి పరిశీలన కార్యక్రమంలో డీఆర్డీఓ శ్రీనివాస్, తహశీల్దార్ జ్యోతి వరలక్ష్మి దేవి, ఎంపీడీవో కల్పన, పంచాయతీరాజ్ శాఖ ఏఈ సమ్మిరెడ్డి పాల్గొన్నారు. వీరితో పాటు కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు రాజేందర్, ప్రధాన కార్యదర్శి బిక్షపతి, ముఖ్య నాయకులు ప్రకాష్ రెడ్డి, రవీందర్, సుధాకర్, వివిధ గ్రామాల సర్పంచ్లు రవికుమార్, రాజు, పంచాయతీ కార్యదర్శి శివకుమార్ తదితరులు పాల్గొన్నారు.
