తెలంగాణ తరఫున బరిలోకి కార్తీక్, గణేష్
మే 30 నుండి ఒడిశాలో పోటీలు
వరంగల్ వాయిస్, వరంగల్ : ఒడిశా వేదికగా జరగనున్న జాతీయ స్థాయి కిక్ బాక్సింగ్ పోటీలకు వరంగల్ జిల్లాకు చెందిన ఇద్దరు క్రీడాకారులు ఎంపికయ్యారు. మే 30 నుంచి జూన్ 3 వరకు జరిగే ఈ ప్రతిష్టాత్మక పోటీలలో వరంగల్‌లోని ‘మణి మార్షల్ ఆర్ట్స్ అకాడమీ’కి చెందిన విద్యార్థులు తెలంగాణ రాష్ట్రం తరఫున ప్రాతినిధ్యం వహించనున్నారు. అండర్-69 కేటగిరీలో కార్తీక్ పరిశి, అలాగే అండర్-54 కేటగిరీలో గణేష్ పూసల జాతీయ స్థాయి పోటీలలో తమ సత్తా చాటడానికి సిద్ధమయ్యారని ప్రముఖ మార్షల్ ఆర్ట్స్ కోచ్, వరంగల్ జిల్లా కిక్ బాక్సింగ్ అసోసియేషన్ ప్రెసిడెంట్ మణికంట తెలిపారు. జాతీయ స్థాయిలో రాణించి వరంగల్ జిల్లా కీర్తిని, తెలంగాణ సత్తాను చాటాలని ఆకాంక్షిస్తూ కోచ్ మణికంటతో పాటు టీం మేనేజర్ ముదిగొండ సతీష్, క్రీడాకారుల తల్లిదండ్రులు, స్నేహితులు, తోటి విద్యార్థులు కార్తీక్, గణేష్‌లకు ఘనంగా వీడ్కోలు పలికి, ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేశారు.
