- కలెక్టర్ డాక్టర్ సత్య శారద
వరంగల్ వాయిస్, వరంగల్ (మార్చి 24, 2026): క్షయవ్యాధిపై ప్రజల్లో విస్తృతంగా అవగాహన కల్పించి క్షయ రహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు సమష్టిగా పని చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద అన్నారు. ప్రపంచ క్షయ వ్యాధి దినోత్సవం సందర్భంగా “Yes..! We Can End TB” అనే థీమ్‌తో జిల్లాలో విస్తృత స్థాయిలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించామని తెలిపారు.
ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా క్షయ వ్యాధిపై ప్రజల్లో అవగాహన పెంచుతూ, సమగ్రంగా పరీక్షలు నిర్వహించి అవసరమైన చికిత్సలు అందించాలని సూచించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద, అడిషనల్ కలెక్టర్ సంధ్యారాణి, స్థానిక కార్పొరేటర్లు, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ బి. సాంబశివరావు కలిసి జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. సికేఎం కాలేజ్ జంక్షన్ నుంచి పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, దేశాయిపేట వరకు ర్యాలీ నిర్వహించారు. ర్యాలీ అనంతరం జరిగిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ, క్షయ వ్యాధి ఒక అంటువ్యాధి కావడంతో ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు పాటించాలని సూచించారు. వ్యాధిని ప్రారంభ దశలోనే గుర్తిస్తే పూర్తిగా నయం చేయవచ్చని, అందుకే లక్షణాలు కనిపించిన వెంటనే వైద్యులను సంప్రదించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా ప్రతి గ్రామం, వార్డు స్థాయిలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించి, అవసరమైన వారికి పరీక్షలు చేసి చికిత్సలు అందించాలని అధికారులను ఆదేశించారు. క్షయ రోగులకు పోషణ అభియాన్ కింద అందాల్సిన ఆర్థిక సహాయాన్ని సమయానికి అందించాలన్నారు.
జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ బి. సాంబశివరావు మాట్లాడుతూ, గత సంవత్సరం జిల్లాలో 1263 క్షయ కేసులు నమోదయ్యాయని, ప్రస్తుత సంవత్సరంలో ఇప్పటివరకు 298 కేసులు నమోదైనట్లు తెలిపారు. ప్రజల్లో అవగాహన పెరగడం వల్ల వ్యాధి తగ్గుముఖం పడుతోందని, ఇదే విధంగా కృషి చేస్తే జిల్లాను క్షయ రహిత జిల్లాగా మార్చవచ్చని అన్నారు.
క్షయ రోగులకు సమయానికి మందులు, అవసరమైన సేవలు అందించాలని వైద్య సిబ్బందికి ఆయన ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ సంధ్యారాణి, కార్పొరేటర్లు కావేటి కవిత, రాజు సురేష్, జోషి, బస్వరాజ్ కుమారస్వామి, డాక్టర్ బి. సాంబశివరావు, డిప్యూటీ డీఎంహెచ్ఓ డాక్టర్ ప్రకాష్, ప్రోగ్రాం అధికారులు డాక్టర్ ఇక్బాల్ అహ్మద్, డాక్టర్ అరుణ్ జోషి, డాక్టర్ విజయకుమార్, స్థానిక వైద్యాధికారి డాక్టర్ భరత్ కుమార్, క్షయ నియంత్రణ సిబ్బంది, జిల్లా ప్రాజెక్టు కోఆర్డినేటర్ సురేందర్, ఆరోగ్య కార్యకర్తలు, ఆశా కార్యకర్తలు, మేధా నర్సింగ్ కాలేజ్ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

