- ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణపు పనులను మరింత వేగవంతంగా పూర్తి చేయాలి.
- వచ్చే వర్షాకాలం నాటికి మొక్కలు సిద్ధం చేయాలి.
- అంగన్వాడి విద్యార్థులకు పౌష్టిక ఆహారం అందించాలి.
- జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్.
వరంగల్ వాయిస్, ములుగు : నిర్మాణాలు పూర్తయిన ఇందిరమ్మ ఇండ్ల ను గృహప్రవేశాలకు సిద్ధం చేయాలని, వివిధ దశలో ఉన్న ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణపు పనులను మరింత వేగవంతంగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్. అన్నారు. మంగళవారం గోవిందరావుపేట మండలంలోని ఎన్టీఆర్ కాలనీలో వివిధ దశ లో నిర్మాణంలో ఉన్న ఇందిరమ్మ ఇండ్లను జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్. పరిశీలించారు. అనంతరం మండల కేంద్రంలోని నర్సరీని, అంగన్వాడీ కేంద్రం ను జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్. సందర్శించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మండల కేంద్రం లో ఇందిరమ్మ పథకం కింద నిర్మిస్తున్న మొత్తం ఇండ్లు, ఇప్పటి వరకు ప్రారంభించినవి, ప్రారంభానికి సిద్ధంగా ఉన్న ఇండ్లు, మిగిలినవి ఏ.ఏ దశలో ఉన్నాయని అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ నిర్మాణాలు పూర్తయి ప్రారంభానికి సిద్ధంగా ఉన్న ఇందిరమ్మ ఇండ్లను ప్రారంభోత్సవాలకు సిద్ధం చేయాలని సూచించారు. ఇంటి నిర్మాణానికి అవసరమైన మెటీరియల్ ను లబ్ధిదారులకు తక్కువ ధరకు ఇప్పించి ఇండ్ల నిర్మాణపు పనులు త్వరగా పూర్తి అయ్యేలా కృషి చేయాలన్నారు. ఇప్పటి వరకు నిర్మాణం అయినంత వరకు లబ్ధిదారుల అకౌంట్ లలో డబ్బులు జమ అవుతున్నాయా అని ఆరా తీశారు. వివిధ దశలో మిగిలి ఉన్న నిర్మాణ పనులను కూడా పూర్తి చేస్తే చివరి బిల్లు కూడా వస్తుందని త్వరగా పూర్తి చేసుకొని గృహ ప్రవేశాలు చేపట్టాలన్నారు.
నర్సరీలలో పెంచే మొక్కలను వర్షాకాలం నాటికి నాటేందుకు సిద్ధం చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు. పూల చెట్లతో పాటు పండ్ల చెట్లను నీడనిచ్చే చెట్లను పెంచే విధంగా చూడాలని, వర్షాకాలం నాటికి ప్రజలకు అందించే విధంగా చర్యలు తీసుకోవాలని అన్నారు. ప్రతి ఒక్కరు తమ ఇంటి పరిసర ప్రాంతాల్లో చెట్లు నాటే విధంగా అవగాహన కల్పించాలని, చెట్లతో కలిగే లాభాలను ప్రజలకు వివరించాలని అన్నారు. జిల్లాలో సరిపడా మొక్కలను సిద్ధం చేస్తున్నామని ఆయన వివరించారు.
అంగన్వాడి కేంద్రంలోని విద్యార్థులకు ప్రభుత్వం అందిస్తున్న ఏకరూప దుస్తులను పంపిణీ చేశారు. మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం అందించాలని, స్టాక్ రిజిస్టర్లను ఎప్పటికప్పుడు అప్డేట్ చేయాలని పిల్లలకు బాలింతలకు గర్భిణీ స్త్రీలకు పంపిణీ చేసే పాల ప్యాకెట్ పై ఉండే ముద్రణ తేదీలను గమనిస్తూ గడువు దాటిన వాటిని గుర్తించాలని సిబ్బందిని ఆదేశించారు.
పిల్లల ఎత్తు, బరువులను తరచు పరిశీలిస్తూ రక్తహీనతతో ఉన్న చిన్నారులపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. అంగన్వాడీ కేంద్రం పరిసరాలు శుభ్రంగా ఉండాలని, పిల్లలకు స్వచ్ఛమైన తాగునీరు అందుబాటులో ఉంచాలని సూచించారు. ప్రీ-స్కూల్ బోధన లో భాగంగా చిన్నారులకు ఆటపాటలతో కూడిన విద్యాబోధన చేయాలని, పిల్లలు ఉత్సాహంగా ఉండేలా వాతావరణాన్ని కల్పించాలని, టీచర్లకు దిశానిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో హౌసింగ్ పి డి సూర్య నారాయణ, ఎం పి ఓ మమత స్థానిక ప్రజా ప్రతినిధులు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

