వరికోల్ సర్పంచ్ దొగ్గెల కుమారస్వామి
వరంగల్ వాయిస్, పరకాల: గ్రామాల్లో జరుగుతున్న అభివృద్ధిని ఓర్వలేకనే కాంగ్రెస్ నాయకులు నూతన గ్రంథాలయ ఏర్పాటును వ్యతిరేకిస్తున్నారని వరికోల్ గ్రామ సర్పంచ్ దొగ్గెల కుమారస్వామి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. పరకాల నియోజకవర్గ పరిధిలోని వరికోల్ గ్రామంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావాన్ని పురస్కరించుకొని, వరికోల్ గ్రామ అభివృద్ధి ప్రదాత, శాసనమండలి డిప్యూటీ ఫ్లోర్ లీడర్ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి సహకారంతో, పోచంపల్లి ఫౌండేషన్ ఆధ్వర్యంలో గ్రామ పంచాయతీ నూతన గ్రంథాలయాన్ని, కంప్యూటర్లను యువత కోసం ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. విజ్ఞాన వికాస కేంద్రాలైన గ్రంథాలయాలపై కాంగ్రెస్ నాయకులు కక్షసాధింపు చర్యలకు దిగడం అత్యంత దుర్మార్గమైన విషయమని సర్పంచ్ ఖండించారు. సమాజంలో చదువుకునే విద్యార్థులకు, పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న నిరుద్యోగ యువతీ యువకులకు, మేధావులకు ఎంతో ఉపయోగపడే లైబ్రరీని కాంగ్రెస్ పార్టీ నాయకులు తమ రాజకీయ స్వార్థంతో వ్యతిరేకించడం దారుణమన్నారు. విజ్ఞానాన్ని పంచే విద్యా నిలయాలపై కాంగ్రెస్ నాయకులు తమ నైజాన్ని ప్రదర్శిస్తూ అడ్డుతగలడాన్ని తాము తీవ్రంగా నిరసిస్తున్నామని పేర్కొన్నారు. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వేలాది మంది నిరుద్యోగులు, పేద విద్యార్థులు ఈ గ్రంథాలయంపైనే ఆధారపడి చదువుకుంటున్నారని కుమారస్వామి గుర్తుచేశారు. అలాంటి విద్యా కేంద్రాన్ని మూసివేయాలని చూడటం లేదా ఇక్కడ నిర్మించవద్దని అడ్డుపడటం యువత భవిష్యత్తును అంధకారంలోకి నెట్టడమేనని మండిపడ్డారు. అభివృద్ధి నిరోధకులుగా మారిన కాంగ్రెస్ నాయకులకు జ్ఞానాన్ని ఇచ్చే పుస్తకాల నిలయం అంటే ఎందుకు అంత కక్ష అని, సమాజం చైతన్యవంతం కావడం వారికి ఇష్టం లేదా అని ఆయన ప్రశ్నించారు. కేవలం రాజకీయ దిగజారుడుతనం, స్వార్థ ప్రయోజనాల కోసమే ఇటువంటి పవిత్రమైన స్థలాలపై రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. కాంగ్రెస్ నాయకులు తమ మొండి వైఖరిని వీడకుంటే విద్యార్థి లోకం, నిరుద్యోగులు, ప్రజలందరినీ సమీకరించి పెద్ద ఎత్తున కాంగ్రెస్ నాయకుల ఇళ్ల ముందు ఆందోళనలు చేపడతామని, వారికి తగిన బుద్ధి చెబుతామని సర్పంచ్ హెచ్చరించారు. ఇప్పటికైనా గ్రంథాలయానికి వ్యతిరేకంగా చేస్తున్న కుట్రలను తక్షణమే ఆపాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వరికోలు గ్రామ ఉపసర్పంచ్ మురాల భుజంగరావు, గ్రామ పంచాయతీ పాలకవర్గ సభ్యులు, ముఖ్య నాయకులు పోశాల శ్యాంసుందర్ తదితరులు పాల్గొన్నారు.
