వరంగల్ వాయిస్, హైదరాబాద్ : నిజాం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (నిమ్స్) ఆసుపత్రిలో తెలంగాణ రాష్ట్ర 12వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను మంగళవారం అత్యంత వైభవంగా నిర్వహించారు. నిమ్స్ మెడికల్ అండ్ హెల్త్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ సంబరాలు తెలంగాణ అస్తిత్వాన్ని, సాంస్కృతిక వైభవాన్ని ప్రతిబింబించాయి. వేడుకల్లో భాగంగా నిమ్స్ మహిళా ఉద్యోగులు తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా రంగురంగుల పూలతో బతుకమ్మలను అమర్చి, ఆటపాటలతో సందడి చేశారు. పోచమ్మ తల్లికి భక్తిశ్రద్ధలతో బోనాలు సమర్పించారు. నిమ్స్ ప్రాంగణమంతా సాంస్కృతిక కార్యక్రమాలతో, ఉద్యోగుల ఉత్సాహభరిత కోలాహలంతో పండుగ వాతావరణం నెలకొంది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన నిమ్స్ డైరెక్టర్ డాక్టర్ నగరి బీరప్ప జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి, అమరవీరులకు నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం జరిగిన సుదీర్ఘ పోరాటం చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుందన్నారు. తెలంగాణ కట్టు, బొట్టు, భాష, సంస్కృతి, ఆటపాటలు రాష్ట్ర ప్రత్యేకతను చాటుతాయని, ఈ ఉద్యమ స్ఫూర్తిని భావితరాలకు చేరవేయాల్సిన బాధ్యత అందరిపై ఉందని పిలుపునిచ్చారు. నిమ్స్ లైజనింగ్ ఆఫీసర్, తెలంగాణ రాష్ట్ర ఉద్యోగుల సంఘం అధ్యక్షులు డాక్టర్ మార్త రమేష్ మాట్లాడుతూ.. స్వరాష్ట్ర సాధనలో విద్యార్థులు, ఉద్యోగులు, సకల జనుల త్యాగాలు చిరస్మరణీయమన్నారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత అన్ని రంగాలతో పాటు వైద్య రంగంలోనూ విశేష ప్రగతి సాధించిందని గుర్తుచేశారు. నిమ్స్ ఉద్యోగులంతా ఐక్యంగా పనిచేస్తూ సంస్థ అభివృద్ధికి, రోగుల సేవకు మరింతగా పునరంకితం కావాలని కోరారు. ఈ ప్రగతి ఉత్సవాల్లో నిమ్స్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ యూనియన్ అధ్యక్షులు, జాయింట్ సెక్రటరీ, కార్యవర్గ సభ్యులతో పాటు నిమ్స్ అలైడ్ హెల్త్ సైన్స్ & ప్రొఫెషనల్ కేర్ యూనియన్, నిమ్స్ ఎస్సీ-ఎస్టీ యూనియన్, నిమ్స్ నర్సింగ్ ఆఫీసర్స్ యూనియన్ ప్రతినిధులు, ఆసుపత్రి వైద్యులు, సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
