వరంగల్ వాయిస్, రఘునాథపల్లి : తెలంగాణ ఉపాధ్యాయుల అపరిష్కృత సమస్యలను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ రఘునాథపల్లి మండలంలో ఉపాధ్యాయులు ఆందోళన చేపట్టారు. తెలంగాణ ఉద్యోగుల జాయింట్ యాక్షన్ కమిటీ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు శుక్రవారం మధ్యాహ్న భోజన విరామ సమయంలో ఉపాధ్యాయులు నల్ల బ్యాడ్జీలు ధరించి తహసీల్దార్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. అనంతరం తమ డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని తహసీల్దార్‌కు సమర్పించారు. జూన్ 2 నాటికి కొత్త పే రివిజన్ కమిషన్ నివేదికను అమలు చేయాలి. ఉపాధ్యాయులకు రావాల్సిన అన్ని రకాల పెండింగ్ బిల్లులను రెండు విడతల్లో తక్షణమే చెల్లించాలి. మే 1నుంచి ఉద్యోగులు, ఉపాధ్యాయులకు నగదు రహిత వైద్య సౌకర్యం కల్పించేలా హెల్త్ కార్డులను అమలు చేయాలి. సీపీఎస్ విధానాన్ని రద్దు చేయాలి. ముఖ్యంగా 2003 డీఎస్సీ ఉపాధ్యాయులకు తక్షణమే పాత పెన్షన్ విధానాన్ని వర్తింపజేయాలి. ఈ సందర్భంగా జేఏసీ నాయకులు మాట్లాడుతూ.. ఉపాధ్యాయుల సమస్యల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరిని వీడాలని, న్యాయమైన డిమాండ్లను పరిష్కరించని యెడల పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పీఆర్టీయూ టీఎస్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు బలభక్తుల పరిపూర్ణ చారి, ఆనందాసు పవన్ కుమార్, యూటీఎఫ్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు వై. యాదవరెడ్డి, టీపీటీఎఫ్ అధ్యక్షులు నాగభూషణం, టీయూపీఎస్ యూనియన్ బాధ్యులు పంచాక్షరి, మండలంలోని వివిధ పాఠశాలల ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
