వరంగల్ వాయిస్, గణపురం : జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండలంలోని చారిత్రక సంపద, కాకతీయుల కళాక్షేత్రమైన శ్రీ భవాని సహిత గణపేశ్వరాలయం (కోటగుళ్ళు) గోశాలలోని గోమాతలకు శనివారం దాన బస్తాలను వితరణ చేశారు. పరకాలలోని శ్రీ నారాయణ ఇంగ్లీష్ మీడియం పాఠశాల కరస్పాండెంట్ పోతుగంటి శశిధర చారి, ప్రిన్సిపల్ పోతుగంటి స్వప్న చారి దంపతులు తమ 25వ వివాహ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని ఈ సేవా కార్యక్రమాన్ని చేపట్టారు. తమ రజతోత్సవ వివాహ వేడుకల సందర్భంగా ఈ దంపతులు ఆలయంలోని స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు. అనంతరం గోశాలను సందర్శించి గోమాతలకు దాన బస్తాలతో పాటు పండ్లను తినిపించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు జూలపల్లి నాగరాజు వారికి ప్రత్యేక ఆశీర్వచనాలు అందించి, తీర్థప్రసాదాలను అందజేశారు. పురాతన ఆలయ ప్రాంగణంలోని గోశాల నిర్వహణకు మరియు గోమాతల సంరక్షణకు దాన బస్తాలను అందజేసిన శశిధరాచారి, స్వప్న దంపతులను కోటగుళ్లు పరిరక్షణ కమిటీ సభ్యులు అభినందిస్తూ, వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఆధ్యాత్మిక వేడుకల్లో భాగంగా ఇలాంటి సేవా కార్యక్రమాలు నిర్వహించడం పట్ల స్థానికులు హర్షం వ్యక్తం చేశారు.
