మరణానంతర నేత్రదానంతో ఆదర్శంగా నిలిచారు
అదనపు కలెక్టర్ వై.వి.గణేష్
జీవితాంతం కష్టపడిన గొప్ప శ్రమజీవి
డిప్యూటీ స్పీకర్ డాక్టర్ బండా ప్రకాష్, విశ్రాంత ఐఏఎస్ టి.చిరంజీవులు
వరంగల్ వాయిస్, వరంగల్ : వరంగల్ నగరంలోని రంగశాయిపేట ఉర్సు రోడ్డులో గల గ్రాండ్ సిటీ ప్యాలెస్‌లో సదాశయ ఫౌండేషన్ ఆధ్వర్యంలో దివంగత మండల రాములు (కురుమ రామిరెడ్డి) స్మారక సభను గురువారం అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ సభకు సదాశయ ఫౌండేషన్ జాతీయ అధ్యక్షుడు శ్రావణ్ కుమార్ అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమానికి రాజకీయ, సామాజిక, అధికారిక రంగాల ప్రముఖులు భారీగా హాజరై దివంగతునికి ఘన నివాళులర్పించారు. ఈ సభకు ముఖ్య అతిథిగా హాజరైన వరంగల్ జిల్లా అదనపు కలెక్టర్ వై.వి.గణేష్ మాట్లాడుతూ.. దివంగత మండల రాములు గొప్ప శ్రమజీవి, కర్తవ్యనిష్ఠ కలిగిన మహోన్నత వ్యక్తి అని కొనియాడారు. వరంగల్‌లోని చారిత్రాత్మక ఆజంజాహీ మిల్స్‌లో ఎంతో నిబద్ధతతో సేవలు అందించి 1991లో ఆయన పదవీ విరమణ పొందారని గుర్తుచేశారు. జీవితాంతం నిజాయితీతో బతికిన ఆయన, మరణానంతరం తన నేత్రాలను దానం చేసి సమాజానికి గొప్ప సందేశాన్ని ఇచ్చారని ప్రశంసించారు. ఆయన స్ఫూర్తితో ప్రతి ఒక్కరూ అవయవ దానానికి ముందుకు రావాలని పిలుపునిచ్చారు. బీసీ మేధావుల తెలంగాణ ఫోరం వ్యవస్థాపక అధ్యక్షులు, విశ్రాంత ఐఏఎస్ అధికారి టి. చిరంజీవులు మాట్లాడుతూ.. మండల రాములు బీసీ కురుమ సమాజానికి ఆదర్శప్రాయుడిగా నిలిచారన్నారు. కష్టాన్ని నమ్ముకుని కుటుంబ గౌరవాన్ని నిలబెట్టిన ఆయన, నేత్రదానం ద్వారా నేటి తరానికి దిశా నిర్దేశం చేశారని తెలిపారు. తెలంగాణ శాసనసభ ఉపాధ్యక్షులు డాక్టర్ బండా ప్రకాష్ మాట్లాడుతూ.. ఆజంజాహీ మిల్స్ కార్మికుడిగా అంకితభావంతో పనిచేసిన రాములు జీవితం అందరికీ ఆదర్శమన్నారు. ఆయనకు తన వ్యక్తిగత తరఫున ప్రగాఢ నివాళులు అర్పిస్తున్నట్లు తెలిపారు. రామగుండం-2 ఏరియా ఏఐటీయూసీ వైస్ ప్రెసిడెంట్ జిగురు రవీందర్ మాట్లాడుతూ.. రంగశాయిపేట, ఉర్సు, కరీమాబాద్, తిమ్మాపూర్ తదితర ప్రాంతాల ప్రజల్లో ‘కురుమ రామిరెడ్డి’గా ఆయన చెరగని ముద్ర వేసుకున్నారని కొనియాడారు. ఈ స్మారక సభలో సదాశయ ఫౌండేషన్ ప్రతినిధులు కరేటి శంకర్ రావు, సంపత్ రావు, విశ్రాంత డీఎఫ్‌వో ఖాజీపేట పురుషోత్తం, వరంగల్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు చాకిలం ఉపేందర్, గౌరవ న్యాయమూర్తి కంచ ప్రసాద్, మండల హేమంత్ కుమార్, జర్నలిస్ట్ శంకేషి శంకర్ రావు, డాక్టర్ తాళ్ల రవి, చీకటి సమ్మయ్య, గుండు పూర్ణచందర్ పాల్గొన్నారు. అలాగే బీసీ మేధావుల ఫోరం సభ్యులు వీరస్వామి, డాక్టర్ కొంతం కృష్ణ, వడ్నాల నరేందర్, రావుల బాలరాజు, కోరే కుమారస్వామి బ్రదర్స్, జిగురు శ్రీనివాస్, బుర్రి సురేందర్ శేఖర్, చీర వాసుదేవ్, మురికి రవి, నంద రమేష్, గోపిరెడ్డి సురేష్, నరిగే శీను, దయ్యాల వీరేశం, కొండ్రెడ్డి నవీన్ రెడ్డి, వివిధ జనతా, పూర్వ మిత్ర, వినాయక, జై హనుమాన్ పరపతి సంఘాల సభ్యులు, దివంగత మండల రాములు కుమారులు మండల పరశురాములు, మండల నరసింహ రాములు, స్థానిక ప్రజలు భారీ సంఖ్యలో పాల్గొని నివాళులర్పించారు.
