దేశవ్యాప్తంగా వరంగల్ ఖ్యాతిని చాటిన సాహ్యూ
అఖిల భారత ఓపెన్ కేటగిరీలో 9వ ర్యాంకు..
దక్షిణ భారతదేశంలోనే ప్రథమ స్థానం
ఎస్సార్ విద్యాసంస్థల చరిత్రలో సరికొత్త రికార్డు..
కార్డియోథొరాసిక్ సర్జన్ కావడమే లక్ష్యం
వరంగల్ వాయిస్, హనుమకొండ : జాతీయ స్థాయి వైద్య విద్యా ప్రవేశ పరీక్ష ‘నీట్–2026’ ఫలితాలు వెలువడగానే దేశవ్యాప్తంగా అందరి దృష్టి ఓరుగల్లు వైపు పడింది. వరంగల్‌కు చెందిన ఎస్సార్ విద్యాసంస్థల విద్యార్థి వీరయ్యగారి సాహ్యూ అసాధారణ ప్రతిభతో జాతీయ స్థాయిలో సంచలన విజయాన్ని నమోదు చేశాడు. సాహ్యూ అఖిల భారత స్థాయిలో ఓపెన్ కేటగిరీలో 9వ ర్యాంకు, ఓవరాల్‌గా 13వ ర్యాంకు సాధించడమే కాకుండా, దక్షిణ భారతదేశంలోనే టాపర్‌గా నిలిచి వరంగల్ నగర కీర్తిని దేశ పటంలో అగ్రభాగాన నిలిపాడు. ఎస్సార్ విద్యాసంస్థల క్రమశిక్షణతో కూడిన బోధన, నిరంతర పరీక్షలు, అనుభవజ్ఞులైన అధ్యాపకుల మార్గదర్శకత్వమే ఈ చారిత్రాత్మక విజయానికి నిదర్శనమని విద్యావర్గాలు కొనియాడాయి. తన అద్భుత విజయ రహస్యాన్ని నీట్ టాపర్ సాహ్యూ వెల్లడించాడు. “ఈ విజయమేదీ అదృష్టం వల్ల రాలేదు, రెండేళ్ల పాటు ప్రణాళికాబద్ధంగా కష్టపడి చదవడం వల్లే సాధ్యమైంది. ఈసారి ప్రశ్నాపత్రం చాలా కఠినంగా ఉంది. మొదట పరీక్ష నిర్వహించి రద్దు చేసినప్పుడు తీవ్ర బాధ అనిపించినా.. నిరాశ చెందకుండా రెండోసారి రాయడాన్ని ఓ సవాలుగా తీసుకున్నాను” అని తెలిపాడు. నీట్‌లో రాణించాలంటే బట్టీ విధానానికి స్వస్తి చెప్పి, ప్రతి అంశాన్ని అర్థం చేసుకుంటూ సబ్జెక్టులో లీనమవ్వాలని తోటి విద్యార్థులకు సూచించాడు. తన తల్లిదండ్రులు డాక్టర్ రమాకాంత్, డాక్టర్ శ్రీదేవి ఇద్దరూ వైద్యులే అయినప్పటికీ చదువు విషయంలో తనపై ఎన్నడూ ఒత్తిడి చేయలేదని, వారి ప్రోత్సాహమే తన బలమని చెప్పాడు. సుమారు 23 లక్షల మంది పోటీపడిన ఈ పరీక్షలో ఉత్తమ ర్యాంకు రావడం సంతోషంగా ఉందని, భవిష్యత్తులో కార్డియోథొరాసిక్ సర్జన్‌గా మారి సమాజానికి సేవ చేయడమే తన జీవిత ఆశయమని సాహ్యూ స్పష్టం చేశాడు. సాహ్యూ సాధించిన ఘన విజయంపై ఆయన తండ్రి డాక్టర్ రమాకాంత్ మాట్లాడుతూ.. పిల్లలు స్వతహాగా ఆసక్తితో చదివేలా చూడాలి తప్ప తల్లిదండ్రులు మార్కుల కోసం ఒత్తిడి చేయకూడదని హితవు పలికారు. సాహ్యూ 9వ తరగతి నుంచే తన లక్ష్యం కోసం నాలుగేళ్ల పాటు అంకితభావంతో శ్రమించాడని గుర్తుచేశారు. ఎస్సార్ విద్యాసంస్థల చైర్మన్ వరదారెడ్డి పర్యవేక్షణలో అధ్యాపక బృందం అందించిన నాణ్యమైన శిక్షణే తమ కుమారుడి విజయానికి పునాది అని, ఈ సంస్థకు తాము జీవితాంతం రుణపడి ఉంటామని కృతజ్ఞతలు తెలిపారు. సాహ్యూ తల్లి డాక్టర్ వీరయ్యగారి శ్రీదేవి మాట్లాడుతూ.. తమ కుమారుడు నీట్‌లో ఈ స్థాయి ర్యాంకు సాధించి తాల్ని సంభ్రమాశ్చర్యాలకు గురిచేశాడన్నారు. పాఠశాల స్థాయి నుండి ఎప్పుడూ ప్రథమ స్థానంలో ఉండే సాహ్యూకు మార్కుల కన్నా సబ్జెక్టుపై పూర్తి అవగాహన పెంచుకోవడంపైనే దృష్టి పెట్టమని తాము చెప్పేవాళ్లమన్నారు. పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే వారు కేవలం మార్కుల కోసం కాకుండా విషయ పరిజ్ఞానం పెంపొందించుకోవాలని సూచించారు. సాహ్యూ జాతీయ స్థాయి ర్యాంకు సాధించడం పట్ల ఎస్సార్ విద్యాసంస్థల చైర్మన్ ఎనగందుల వరదారెడ్డి తీవ్ర హర్షం వ్యక్తం చేశారు. దశాబ్దాలుగా పక్కా ప్రణాళిక, శాస్త్రీయ బోధన, ఒత్తిడి లేని విద్యా వాతావరణాన్ని కల్పించడం వల్లే ఇలాంటి ఫలితాలు సాధ్యమవుతున్నాయని పేర్కొన్నారు. సాహ్యూ కృషితో ఓరుగల్లు ఖ్యాతి దేశవ్యాప్తంగా విరిసిందని, భవిష్యత్తులోనూ ఆధునిక బోధనా విధానాలతో నీట్, జేఈఈ, ఎంసెట్ పరీక్షల్లో మరిన్ని ఉత్తమ ర్యాంకులు సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఎస్సార్ విద్యాసంస్థల డైరెక్టర్ సంతోష్ రెడ్డి మాట్లాడుతూ.. తమ సంస్థలో విద్యార్థులకు కేవలం మార్కులకే పరిమితం చేయకుండా విలువలతో కూడిన నాణ్యమైన విద్యనందిస్తున్నామని తెలిపారు. విద్యార్థులపై అనవసర ఒత్తిడి లేకుండా, కళ్లపై కూడా భారం పడకుండా సులభంగా అర్థమయ్యే రీతిలో బోధిస్తున్నామని చెప్పారు. నిరంతర కృషి, తల్లిదండ్రుల సహకారం, అధ్యాపకుల అంకితభావం కలగలిసి ఈ జాతీయ స్థాయి విజయాన్ని తెచ్చిపెట్టాయని అభినందించారు.
