Thursday, September 10, 2026
HomeWarangal“నో–గో–టెల్ పాటించండి.. డ్రగ్స్‌కు దూరంగా ఉండండి: వరంగల్ జిల్లా న్యాయ సేవాధికార సంస్థ,కార్యదర్శి కందుకూరి...

“నో–గో–టెల్ పాటించండి.. డ్రగ్స్‌కు దూరంగా ఉండండి: వరంగల్ జిల్లా న్యాయ సేవాధికార సంస్థ,కార్యదర్శి కందుకూరి పూజ

📰 Generate e-Paper Clip

వరంగల్ వాయిస్, వరంగల్ : “నో–గో–టెల్ పాటించి డ్రగ్స్‌కు దూరంగా ఉండాలని వరంగల్ జిల్లా న్యాయ సేవాధికార సంస్థ,కార్యదర్శి కందుకూరి పూజ సూచించారు. బుధవారం మొగిలిచెర్లలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జిల్లా న్యాయ వరంగల్ జిల్లా న్యాయ సేవాధికార సంస్థ, కార్యదర్శి,సీనియర్ సివిల్ జడ్జి కందుకూరి పూజ విద్యార్థులకు “మాదకద్రవ్యాల అవగాహన – ఆరోగ్యం, అనారోగ్యం” అంశంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కార్యదర్శి కందుకూరి పూజ మాట్లాడుతూ “గంజాయి లేని సమాజాన్ని సిద్ధం చేయాలని గౌరవ సుప్రీం కోర్టు ఆదేశాలను అనుసరించి, న్యాయ సేవాధికార సంస్థలు విస్తృతంగా సదస్సులు నిర్వహించి, యువతను చైతన్య పరుస్తున్నాయి అని తెలిపారు. యువత మత్తు పదార్థాలకు అలవాటు పడ్డట్లయితే సామాజిక, మానసిక, శారీరక అనారోగ్యాలు తలెత్తుతాయని తెలిపారు. మాదకద్రవ్యాల వినియోగం వల్ల విద్యార్థుల శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ఆరోగ్యం కూడా దెబ్బతింటుందని తెలిపారు. డ్రగ్స్‌కు అలవాటు పడటం వల్ల చదువుపై ఆసక్తి తగ్గడం, కుటుంబ సంబంధాల్లో సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, సామాజికంగా అనేక సమస్యలు తలెత్తే అవకాశం ఉందని వివరించారు.ఎవరైనా డ్రగ్స్ లేదా ఇతర మాదక పదార్థాలను అందించినప్పుడు “నో – గో – టెల్” అనే సూత్రాన్ని పాటించాలని సూచించారు.నో – డ్రగ్స్‌ను స్పష్టంగా తిరస్కరించాలి.గో – వెంటనే అక్కడి నుంచి దూరంగా వెళ్లిపోవాలి.టెల్ – జరిగిన విషయాన్ని తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు లేదా నమ్మకమైన పెద్దలకు వెంటనే తెలియజేయాలి అని వివరించారు.మాదకద్రవ్యాల వినియోగానికి దారితీసే చెడు స్నేహాలు, చెడు అలవాట్లు, ఒత్తిడి, ఆసక్తి కోసం ప్రయోగించడం వంటి వాటికి విద్యార్థులు దూరంగా ఉండాలని ఆమె సూచించారు. సోషల్ మీడియా, ఇంటర్నెట్ ద్వారా వచ్చే మాదకద్రవ్యాలకు సంబంధించిన ప్రలోభాలకు కూడా అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. మాదకద్రవ్యాల వినియోగం సరదాగా మొదలయ్యి, క్రమంగా వ్యసనంలా మారి, చివరకు జీవితాన్ని నాశనం చేస్తుందని తెలిపారు. మద్యం, డ్రగ్స్ మత్తులో తీవ్రమైన నేరాలకు పాల్పడుతారు, మత్తుపదార్థాలు లేనిదే తమ దైనందిన చర్యలు కూడా చేయలేకపోయే స్థాయికి దిగజారతారని తెలిపారు.విద్యార్థులు తమ సమస్యలను తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు లేదా నమ్మకమైన పెద్దలతో స్వేచ్ఛగా పంచుకోవాలని, సమస్యను దాచిపెట్టకుండా సరైన సమయంలో సహాయం కోరాలని సూచించారు. స్కూళ్లు, కళాశాలలు, ఇతర ప్రాంతాల్లో డ్రగ్స్ తీసుకుంటున్నా, విక్రయిస్తున్నా పోలీసులకు గానీ, సంబంధిత అధికారులకి గానీ, న్యాయ సేవాధికార సంస్థలకు (15100) సమాచారం అందించాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా పాఠశాలలోని విద్యార్థులకు అందిస్తున్న మధ్యాహ్న భోజన పథకాన్ని పరిశీలించి, భోజనం నాణ్యత, పరిశుభ్రత, పోషక విలువలు మరియు విద్యార్థులకు సక్రమంగా పంపిణీ జరుగుతున్న తీరును తనిఖీ చేశారు.ఈ కార్యక్రమంలో పాఠశాల ఇంచార్జి ప్రధానోపాధ్యాయులు భైరి విజయ్ కుమార్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular