నిమ్స్‌లో చికిత్స పొందుతూ మృతి చెందిన పెంబర్తి మొగిలి కుటుంబానికి భరోసా
రూ.2 లక్షల ఎల్ఓసీ మంజూరు..
మరో రూ.1.12 లక్షల బకాయికి అదనపు సహాయం హామీ
వరంగల్ వాయిస్, శాయంపేట: ఆపదలో ఉన్న సామాన్య ప్రజలకు రాజకీయాలకు అతీతంగా అండగా నిలుస్తూ, బాధిత కుటుంబాలకు భరోసా కల్పించడం నిజమైన ప్రజాసేవకు నిదర్శనమని శాసనమండలి ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి మరోసారి నిరూపించారు. శాయంపేట మండలం కొత్తగట్టు సింగారం గ్రామానికి చెందిన పెంబర్తి మొగిలి బ్రెయిన్ సంబంధిత తీవ్ర అనారోగ్యంతో హైదరాబాద్‌లోని నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సమయంలో ఉపసర్పంచ్ సాయి సిరికొండ మధుసూదనాచారి దృష్టికి తీసుకెళ్లగా సిరికొండ మధుసూదనాచారి ఆసుపత్రికి వెళ్లి పరామర్శించారు. వైద్య ఖర్చుల నిమిత్తం ఎల్ఓసీ ద్వారా రూ.2 లక్షల ఆర్థిక సహాయం మంజూరు చేయించారు. అయితే చికిత్స పొందుతూ మొగిలి ఇటీవల మృతి చెందారు. ఆసుపత్రి మొత్తం బిల్లు రూ.3,12,600 కాగా, రూ.2 లక్షల ఎల్ఓసీ మినహా మిగిలిన రూ.1,12,600 బకాయి చెల్లించిన తర్వాతే మృతదేహాన్ని అప్పగిస్తామని ఆసుపత్రి సిబ్బంది కుటుంబ సభ్యులకు తెలిపారు. ఈ విషయం తెలుసుకున్న మధుసూదనాచారి వెంటనే నిమ్స్ ఆసుపత్రికి చేరుకుని డైరెక్టర్‌తో మాట్లాడారు. మిగిలిన బకాయి మొత్తాన్ని ఎల్ఓసీ ఎన్హాన్స్మెంట్ ద్వారా మంజూరు చేయిస్తానని హామీ ఇవ్వడంతో ఆసుపత్రి యాజమాన్యం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించింది. అనంతరం స్వయంగా కొత్తగట్టు సింగారం గ్రామానికి వెళ్లి మృతుడి కుటుంబ సభ్యులను పరామర్శించి, వారికి మనోధైర్యం కల్పించారు. కష్టకాలంలో బాధిత కుటుంబానికి అండగా నిలిచి మానవీయతను చాటుకున్నారు. ఆపదలో ఉన్నవారికి తక్షణమే స్పందించి సహాయం అందించడం, బాధిత కుటుంబాలకు అండగా నిలవడం ద్వారా సిరికొండ మధుసూదనాచారి ప్రజాసేవ పట్ల తన నిబద్ధతను చాటుకున్నారని స్థానికులు పేర్కొన్నారు.
