Tuesday, April 28, 2026
HomeBhupalapallyబాలల రక్షణ -భద్రతపై అవగాహన సదస్సు

బాలల రక్షణ -భద్రతపై అవగాహన సదస్సు

📰 Generate e-Paper Clip

వరంగల్ వాయిస్, చిట్యాల : మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ‘99 రోజుల ప్రజా పాలన’లో భాగంగా జూకల్ గ్రామంలో బాలల రక్షణ, భద్రతపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. సూపర్వైజర్ జయప్రద పర్యవేక్షణలో జరిగిన ఈ సదస్సుకు చిట్యాల ఎస్సై సతీష్, తహసీల్దార్ వసంతరావు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా తహసీల్దార్ వసంతరావు మాట్లాడుతూ.. ఆడపిల్లలు అన్ని రంగాల్లో రాణించాలంటే చదువు ఒక్కటే మార్గమని, ఎన్ని అడ్డంకులు ఎదురైనా విద్యను మధ్యలో ఆపవద్దని సూచించారు. అనంతరం ఎస్సై సతీష్ మాట్లాడుతూ.. బాలికలు బయటి వారి మోసపూరిత మాటలకు లోబడవద్దని, మొబైల్ ఫోన్లకు దూరంగా ఉంటూ లక్ష్యంపై దృష్టి పెట్టాలన్నారు. బాల్య వివాహాలు చట్టరీత్యా నేరమని, అటువంటి వాటిని ప్రోత్సహించవద్దని కోరారు. మహిళా శక్తి కేంద్రం ప్రతినిధి మమత 11 నుండి 18 ఏళ్ల లోపు బాలికలు ఎదుర్కొంటున్న సమస్యలు, చట్టాలపై వివరించారు. పల్లె దవాఖాన డాక్టర్ రాకేష్ మాట్లాడుతూ.. భవిష్యత్తులో గర్భాశయ క్యాన్సర్ రాకుండా 14 నుండి 15 ఏళ్ల లోపు బాలికలకు ప్రభుత్వం రూ. 9 వేల విలువైన ఇంజక్షన్‌ను ఉచితంగా అందిస్తోందని, దీనిని అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. గ్రామ సర్పంచ్ ఎలగొండ సంధ్యారాణి మాట్లాడుతూ.. బాలికలు పోషకాహారం తీసుకోవాలని, వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని సూచించారు. అనంతరం అతిథుల చేతుల మీదుగా అవగాహన పోస్టర్‌ను ఆవిష్కరించి, అందరితో ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమాన్ని విజయవంతం చేసిన అంగన్వాడీ టీచర్లను అధికారులు అభినందించారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ అనిల్ సోయల్, అంగన్వాడీ టీచర్లు కరుణాదేవి, అరుణ, విజయలక్ష్మి, సరిత, మమత, ఏఎన్ఎం సంధ్యారాణి, కిశోర బాలికలు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular