పర్వతగిరి సీఐ రాజగోపాల్
వరంగల్ వాయిస్, పర్వతగిరి : వాహనదారులు ప్రయాణ సమయంలో వ్యక్తిగత భద్రతపై ప్రత్యేక దృష్టి సారించాలని పర్వతగిరి సీఐ రాజగోపాల్ సూచించారు. శుక్రవారం మండలంలోని అన్నారం గ్రామంలోని తెలంగాణ తల్లి సెంటర్ వద్ద ఎస్సై బి.ప్రవీణ్ కుమార్ తో కలిసి గ్రామ యువత, ప్రజలతో రోడ్డు భద్రతపై అవగాహన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ.. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, కారు నడిపే వారు సీటు బెల్టు పెట్టుకోవాలని కోరారు. రోడ్డు ప్రమాదం జరిగినప్పుడు ప్రతి ఒక్కరూ బాధ్యతగా స్పందించి బాధితులను కాపాడే ప్రయత్నం చేయాలన్నారు. ప్రమాదంలో ఉన్న వ్యక్తులను ఆదుకుని, 108 లేదా పోలీసులకు సమాచారం అందించి ప్రాణాలు కాపాడిన వారికి కేంద్ర ప్రభుత్వం రూ.25,000 పారితోషకం అందిస్తుందని తెలిపారు. సకాలంలో స్పందించిన వారికి పోలీస్ శాఖ తరపున ప్రశంసా పత్రం కూడా అందజేస్తామన్నారు. అత్యవసర సమయాల్లో ప్రాణాపాయం నుండి ఎలా తప్పించాలో వివరిస్తూ, 108 సిబ్బంది ప్రజలకు ప్రత్యక్షంగా అవగాహన కల్పించారు. ముఖ్యంగా గుండెపోటు వచ్చిన వ్యక్తులకు సీపీఆర్ ఎలా చేయాలి, ప్రథమ చికిత్స ఎలా అందించాలనే దానిపై ‘మాక్ షో’ నిర్వహించి వివరించారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ గాడిపెల్లి మహేందర్, ఉప సర్పంచ్ గొడుగు ఏకాంతం, వార్డు సభ్యులు, గ్రామ యువత, 108 అంబులెన్స్ సిబ్బంది, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
