వరంగల్ వాయిస్, పర్వతగిరి : తెలంగాణ సంస్కృతికి ప్రతీకయిన బతుకమ్మ పండుగ సందర్భంగా అన్నారం గ్రామంలో తొలిరోజు ‘ఎంగిలిపూల బతుకమ్మ’ వేడుకలు ఎంతో ఉత్సాహభరిత వాతావరణంలో ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ పండుగ వేడుకల శుభసందర్భాన్ని పురస్కరించుకుని గ్రామ పంచాయతీ నిధులతో నూతనంగా నిర్మించిన బతుకమ్మ విగ్రహాలను గ్రామ సర్పంచ్ గాడిపెల్లి మహేందర్, ఉపసర్పంచ్ గొడుగు ఏకాంత, పంచాయతీ కార్యదర్శి నిమ్మల రాజులతో కలిసి శనివారం అధికారికంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా సర్పంచ్ గాడిపెల్లి మహేందర్ మాట్లాడుతూ.. గ్రామంలో బతుకమ్మ పండుగను మహిళలందరూ సంప్రదాయబద్ధంగా, సమైక్యతా భావంతో, ఆనందోత్సాహాల మధ్య జరుపుకోవడం ఎంతో సంతోషాన్ని కలిగిస్తోందన్నారు. గ్రామ సౌందర్యీకరణతో పాటు మన సంస్కృతికి చిహ్నంగా ఈ విగ్రహాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో స్థానిక వార్డు సభ్యులు, మార్కెట్ డైరెక్టర్ గొడుగు బిక్షపతి, యువజన సంఘాల నాయకులు, ఆశా వర్కర్లు, గ్రామ పెద్దలు, ప్రజాప్రతినిధులు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
