ఈ నెల 26న పరకాలకు ఓసీ జేఏసీ బస్సు యాత్ర
10 వేల మందితో భారీ బహిరంగ సభకు సన్నాహాలు
ఆర్‌ఆర్ గార్డెన్‌లో సన్నాహక సమావేశం
రథయాత్ర పోస్టర్ ఆవిష్కరణ
వరంగల్ వాయిస్, పరకాల : అన్ని కులాల్లోని ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు రిజర్వేషన్లు కల్పించడమే ధ్యేయంగా ఓసీ సంఘాలు ఐక్య ఉద్యమానికి సిద్ధమవుతున్నాయి. ఓసీ జేఏసీ ఆధ్వర్యంలో ఈ నెల 26న చేపట్టనున్న బస్సు యాత్ర పరకాలకు చేరుకోనున్న నేపథ్యంలో పట్టణంలోని ఆర్‌ఆర్ గార్డెన్‌లో శుక్రవారం ప్రతినిధుల సన్నాహక సమావేశం నిర్వహించారు. ఓసీ జేఏసీ ఉమ్మడి జిల్లా అధికార ప్రతినిధులు కొలుగూరి రాజేశ్వరరావు, మాడుగుల పాపిరెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశానికి జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు గోపు జైపాల్‌రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. ఓసీ వర్గాల ఐక్యతను చాటిచెప్పేందుకు ఇదే సరైన సమయమని పిలుపునిచ్చారు. ఇతర కులాలను తక్కువ చేయడం తమ ఉద్దేశం కాదని, ఓసీలలోని పేద కుటుంబాలకు సమాన అవకాశాలు కల్పించడమే తమ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. జాతీయ నాయకుడు అనిల్ అరోరా ఆధ్వర్యంలో సాగే ఈ బస్సు యాత్రను విజయవంతం చేయాలని, 26న పరకాలలో నిర్వహించే బహిరంగ సభకు ఉమ్మడి వరంగల్, కరీంనగర్ జిల్లాల నుంచి 10 వేల మందికి పైగా హాజరయ్యేలా కార్యాచరణ రూపొందించాలని కోరారు. కులంతో సంబంధం లేకుండా అన్ని కులాల్లోని పేదలకు ఆర్థిక ప్రాతిపదికన రిజర్వేషన్లు కల్పించాలి. రిజర్వేషన్లపై ప్రతి ఐదేళ్లకోసారి పునఃసమీక్ష నిర్వహించాలి. క్రీమీలేయర్ విధానాన్ని పక్కాగా అమలు చేయాలి. ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాల సంక్షేమానికి జాతీయ స్థాయిలో ప్రత్యేక కార్పొరేషన్, వారి స్థితిగతుల అధ్యయనానికి శాశ్వత కమిషన్‌ను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. సమావేశం అనంతరం నాయకులు ‘ఓసీ రథయాత్ర’ పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ సమావేశంలోఓసీ ఐకాస రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుబ్బా శ్రీనివాస్, ఉపాధ్యక్షులు చందుపట్ల నర్సింహారెడ్డి, ప్రచార కార్యదర్శి కామిడి సతీష్ రెడ్డి, మేడ్చల్ జిల్లా అధ్యక్షులు పైళ్ల హరినాథ్ రెడ్డి, రెడ్డి జేఏసీ సిద్దిపేట జిల్లా అధ్యక్షులు ఐలినేని మల్లికార్జున రెడ్డి, బహుజన కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు కన్నం లక్ష్మణ్, రజక సంఘం రాష్ట్ర అధ్యక్షులు పరకాల, మండల ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు తమ్మిశెట్టి వెంకటేశ్వర్లు, సంపత్, జమ్మికుంట మార్కెట్ కమిటీ చైర్మన్ ఎర్రబెల్లి రాజేశ్వర రావు, శ్రీరామ్ రవీందర్, ఎర్రం రామన్న, ఎర్రం లక్ష్మన్న, నాయీబ్రాహ్మణ సంఘాల ఉమ్మడి జిల్లా అధ్యక్షులు జంపాల నర్సయ్య, వెంకట శ్రవణ్ కుమారా చార్య, రాజేశ్వర శర్మ, అయిత సతీష్ తదితర రాష్ట్ర, ఉమ్మడి జిల్లా నాయకులు పాల్గొన్నారు.
