ఎల్ నినో ప్రభావంతో తగ్గిన భూగర్భ జలాలు
వరంగల్ వాయిస్, దామెర : ఎల్ నినో పరిస్థితుల దృష్ట్యా రాబోయే రబీ సీజన్లో రైతులు ఎట్టి పరిస్థితుల్లోనూ వరి సాగు చేయవద్దని, తక్కువ నీటితో పండే ఆరుతడి స్వల్పకాలిక పంటలనే సాగు చేయాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క సూచించారు. సోమవారం హైదరాబాద్ నుంచి మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొన్నం ప్రభాకర్, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజులతో కలిసి నిర్వహించిన ‘రైతు నేస్తం’ వీడియో కాన్ఫరెన్స్లో ఆయన మాట్లాడారు. ఈ కార్యక్రమాన్ని దామెర మండల కేంద్రంలోని రైతు వేదిక నుంచి జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్పాయ్, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, రైతులతో కలిసి వీక్షించారు. వర్షాభావం వల్ల నీటి లభ్యత గణనీయంగా తగ్గింది. బిందు సేద్యం (డ్రిప్ ఇరిగేషన్) పద్ధతుల్లో పామాయిల్ తోటలు, కూరగాయలు, ఆరుతడి పంటలు సాగు చేయాలి. రాష్ట్రవ్యాప్తంగా 315 మండలాల్లో వర్షపాతం తగ్గినట్లు గుర్తించాం. త్వరలోనే కరువు మండలాలను ప్రభుత్వం అధికారికంగా ప్రకటిస్తుంది. ‘జలసిరి’తో జల సంరక్షణ: ఇంకుడు గుంతలు, నీటి కుంటలు, బోర్వెల్స్ రీఛార్జ్ పనులను వేగవంతం చేసి భూగర్భ జలాలను కాపాడుకోవాలి. వేసవిలో తాగునీటి ఎద్దడి రాకుండా నీటిని పొదుపుగా వాడాలి. హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ మాట్లాడుతూ, మారుతున్న వాతావరణ పరిస్థితుల వల్ల భూగర్భ జలాలు అడుగుభాగాలకు పడిపోయాయని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వ సూచనల మేరకు రైతులు నీటి వినియోగం తక్కువగా ఉండే ఆరుతడి పంటలనే ఎంచుకోవాలని కోరారు. ఎల్ నినో ప్రభావాలను ఎదుర్కొనేందుకు జిల్లా యంత్రాంగం ప్రత్యేక కార్యాచరణ రూపొందించి అమలు చేస్తోందని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ కల్పన, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ శేషాద్రి, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి విజయ్ చంద్ర, డీఆర్డీవో మేన శ్రీను, తహసీల్దార్ జ్యోతి వరలక్ష్మి దేవి, ఎంపీడీఓ కల్పనతో పాటు మహిళా సంఘాల సభ్యులు, మండల రైతులు పాల్గొన్నారు.
