వరంగల్ వాయిస్, లింగాలఘన్‌పూర్ (రఘునాథపల్లి) : రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యంగా ప్రభుత్వం చేపట్టిన ‘అరైవ్ అలైవ్’ కార్యక్రమంలో భాగంగా శుక్రవారం లింగాలఘన్‌పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని నెల్లూట్ల జాతీయ రహదారిపై భారీ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. వెస్ట్ జోన్ డీసీపీ, జనగామ ఏఎస్పీ ముఖ్య అతిథులుగా హాజరైన ఈ సదస్సులో వాహనదారులు, స్థానికులకు రోడ్డు భద్రతపై కీలక సూచనలు చేశారు. ఈ కార్యక్రమం సందర్భంగా పోలీసులు ఒక నమూనా ప్రమాద దృశ్యాన్ని (మాక్ డ్రిల్) ఏర్పాటు చేసి, ప్రమాదం జరిగిన వెంటనే స్పందించే తీరును ప్రదర్శించారు. ప్రమాదం జరిగిన మొదటి గంట ఎంత విలువైనదో, ఆ సమయంలో ప్రాథమిక చికిత్స అందిస్తే ప్రాణాలు ఎలా కాపాడవచ్చో వివరించారు. రిటైర్డ్ ఆర్మీ కల్నల్ డాక్టర్ భిక్షపతి తన వైద్య బృందంతో కలిసి, అత్యవసర పరిస్థితుల్లో బాధితులకు సీపీఆర్ చేసే విధానంపై ఆచరణాత్మక మార్గదర్శనం చేశారు. రోడ్డు ప్రమాద బాధితులను ఆదుకునేందుకు ప్రభుత్వం ప్రవేశపెట్టిన పీఎం రాహత్, రహావీర్ పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో వెస్ట్ జోన్ డీసీపీ, జనగామ ఏఎస్పీతో పాటు రఘునాథపల్లి సీఐ, రఘునాథపల్లి, చిల్పూర్ ఎస్‌హెచ్‌ఓలు, లింగాలఘన్‌పూర్ ఎస్‌హెచ్‌ఓ, పోలీస్ సిబ్బంది, వైద్య అధికారులు మరియు 108 అత్యవసర సేవల బృందం పాల్గొన్నారు. సుమారు 100 మందికి పైగా స్థానికులు, వాహనదారులు ఈ సదస్సుకు హాజరై ప్రాణరక్షణ పద్ధతులపై అవగాహన పొందారు. ప్రమాద సమయంలో భయపడకుండా బాధ్యతగా వ్యవహరించి బాధితులను ఆదుకోవాలని ఈ సందర్భంగా అధికారులు పిలుపునిచ్చారు
