ఎమ్మెల్యే కడియం శ్రీహరి
కుర్చపల్లిలో రూ.4.10 కోట్లతో అభివృద్ధి పనులు
అంబేద్కర్ విగ్రహావిష్కరణ
గత 15 ఏళ్ల ‘చిల్లర’ రాజకీయాలకు స్వస్తి
సాగునీటి కోసం గోదావరి జలాలు తెస్తా
(స్టేషన్ ఘనపూర్ – వరంగల్ వాయిస్): నియోజకవర్గ ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ, ప్రతి ఎకరానికి సాగునీరు అందించడమే తన లక్ష్యమని మాజీ ఉప ముఖ్యమంత్రి, స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి స్పష్టం చేశారు. మంగళవారం రఘునాథపల్లి మండలం కుర్చపల్లి గ్రామంలో ఆయన సుడిగాలి పర్యటన చేశారు. ఈ సందర్భంగా ఐకేపి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని, నూతనంగా నిర్మించిన ఇందిరమ్మ ఇళ్లను, రూ. 25 లక్షలతో నిర్మించిన సిసి రోడ్లను ప్రారంభించారు. అలాగే బాబాసాహెబ్ అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా నూతనంగా ఏర్పాటు చేసిన అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు.
రెండేళ్లలోనే రూ. 4.10 కోట్ల నిధులు
ఈ సందర్భంగా జరిగిన సభలో కడియం శ్రీహరి మాట్లాడుతూ.. “కుర్చపల్లి పెద్ద గ్రామం అయినప్పటికీ గతంలో ఆశించిన స్థాయిలో అభివృద్ధి జరగలేదు. కానీ నేను ఎమ్మెల్యేగా వచ్చిన ఈ రెండు ఏళ్లలోనే కుర్చపల్లికి మొత్తం రూ. 4 కోట్ల 10 లక్షల అభివృద్ధి నిధులు మంజూరు చేశాను. ఇందులో ఎస్సీ కాలనీ సిసి రోడ్లకు రూ. 45 లక్షలు, సబ్ స్టేషన్ నిర్మాణానికి రూ. 2.10 కోట్లు కేటాయించాం” అని వివరించారు. గ్రామానికి గోదావరి జలాలు తీసుకువచ్చి రైతుల కష్టాలు తీరుస్తానని హామీ ఇచ్చారు.
పేరు చెప్పుకోవడానికే సిగ్గుపడే పరిస్థితి పోయింది!
గత ఎమ్మెల్యే తీరుపై కడియం శ్రీహరి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. “గత 15 ఏళ్లు ఎమ్మెల్యేగా ఉన్న వ్యక్తి తాగుడు, తినుడు, చిల్లర పనులతో నియోజకవర్గానికి చెడ్డ పేరు తెచ్చారు. అప్పట్లో ఎమ్మెల్యే పేరు చెప్పుకోవడానికే ప్రజలు సిగ్గుపడేవారు. కానీ ఇప్పుడు కడియం శ్రీహరి మా ఎమ్మెల్యే అని గర్వంగా చెప్పుకునేలా నా పనితీరు ఉంటుంది” అని పేర్కొన్నారు. తాను చేసే ప్రతి పని శాశ్వతంగా నిలిచిపోయేలా ఉంటుందని స్పష్టం చేశారు.
రిజర్వేషన్ల తొలగింపుపై ధ్వజం
మతం పేరుతో దళితుల రిజర్వేషన్లను తొలగించాలనే ఆలోచన సరైంది కాదని కడియం శ్రీహరి అన్నారు. “దేశంలో ఇప్పటికీ కుల వివక్ష అడుగడుగునా ఉంది. సుప్రీంకోర్టు తీర్పుపై అన్ని పార్టీలు తమ వైఖరిని స్పష్టం చేయాలి. దళితులు సంఘటితంగా ఉండి మన హక్కులను కాపాడుకోవాలి” అని పిలుపునిచ్చారు. చదువుతోనే సామాజిక మార్పు సాధ్యమని, అంబేద్కర్ ఆశయ సాధనే నిజమైన నివాళి అని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్, కుర్చపల్లి సర్పంచ్ బైకాని రాజు, వ్యవసాయ మరియు గృహ నిర్మాణ శాఖ అధికారులు, మండల ప్రజా ప్రతినిధులు, అంబేద్కర్ విగ్రహ కమిటీ సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు.
